కరోనా ఎఫెక్ట్… బంగారం అంతా బ్యాంకుల్లో…

కరోనా ప్రభావంతో అన్ని వ్యాపారాలు దాదాపుగా కుదేలైపోగా.. బంగారం కుదువ వ్యాపారం మాత్రం లాక్ డౌన్ తర్వాత మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్థిల్లుతోంది. ఎక్కడెక్కడి బంగారం అంతా బ్యాంకుల్లోకి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లోకి వెళ్తోంది.

లాక్ డౌన్ కాలంలో జనమంతా ఇళ్లకే పరిమితం కావడంతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో కార్యకాలాపాలు పెద్దగా సాగలేదు. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో చిన్నా చితకా వ్యాపారాలు మొదలు పెట్టేందుకు అందరూ ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వీరందరికీ ఇళ్లలోని బంగారం బ్రహ్మాండమైన పెట్టుబడిగా తోచింది. బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. లాక్ డౌన్ లో ఉద్యోగాలు ఊడిపోయే సరికి చాలామందికి వ్యక్తిగత అవసరాలకు పర్సనల్ లోన్స్ కూడా దొరకడంలేదు.

దీంతో ఆర్థిక అవసరాలకోసం వీరు కూడా గోల్డ్ లోన్ బాట పట్టారు. అందులోనూ బంగారం రేటు పెరగడం, గ్రాముకి అరువుగా ఇచ్చే నగదు పెరగడంతో బంగారు రుణాలలో పెరుగుదల నెలకొన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ ముగిసేనాటికి బంగారు రుణాలలో 15నుంచి 18శాతం వృద్ధినమోదైనట్టు మణప్పురం, ముత్తూట్ లాంటి నాన్ బ్యాంకింగ్ సంస్థలు తెలియజేస్తున్నాయి.

బ్యాంకుల్లో కూడా వ్యవసాయ దారులకు ఇచ్చే బంగారు రుణాల సంఖ్య కూడా 25శాతం వరకు పెరిగినట్టు అంచనా. భారత్ లోనే కాదు.. ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న చాలా దేశాల్లో బంగారాన్ని ప్రధాన పెట్టుబడి వనరుగా చూస్తారు. లాక్ డౌన్ ప్రభావంతో షేర్ మార్కెట్లు కుదేలవడంతో.. ఆటోమేటిక్ గా ఆ పెట్టుబడులన్నీ బంగారంపై పడ్డాయి. డిమాండ్ పెరగడంతో బంగారం రేటు పెరిగింది.

బంగారం రేటు పెరగడం కూడా పరోక్షంగా బంగారంపై తీసుకునే రుణాల సామర్థ్యాన్ని మరింత పెంచింది. సాధారణంగా రుణాలను రెన్యువల్ చేసుకునేవారు కూడా.. గ్రాము రేటు ప్రకారం అధికంగా లభించే రుణాన్ని తీసుకుని రీ షెడ్యూల్ చేసుకుంటున్నారు. కొత్తగా తనఖా పెట్టేవారు ఎక్కువ కావడం, రెన్యువల్ చేసే సమయంలో పాత కస్టమర్లు అధిక మొత్తాన్ని తీసుకోవడంతో.. బంగారు రుణాలలో భారీగా వృద్ధి కనిపిస్తోంది.