ఈ దేశంలో స్వేచ్ఛను బతకనీయండి – సుప్రీం ఘాటు వ్యాఖ్య…

ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు ఓ ఢిల్లీ మహిళను పశ్చిమబెంగాల్ పోలీసులు, స్థానిక హైకోర్ట్ విచారణకు పిలిపించిన తీరుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ ని స్వేచ్ఛా దేశంగానే ఉండనీయాలని వారికి హితవు పలికింది.

ఈ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నాలుగు వారాల్లోగా స్పందించాలని కోరింది. తనపై పెట్టిన ఎఫ్.ఐ.ఆర్. ని కొట్టివేయవలసిందిగా ఆమె కలకత్తా హైకోర్ట్ లో వేసిన పిటిషన్ ను పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టు సూచించింది.

కేసు పూర్వాపరాలు ఇవి..

పశ్చిమబెంగాల్ లోని రాజా బజార్ ప్రాంతంలో లాక్ డౌన్ కాలంలో ప్రజలు గుమికూడి ఉన్న ఓ వీడియోని తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసింది రోషిని బిశ్వాస్ అనే మహిళ. లాక్ డౌన్ అమలు చేయడంలో అక్కడి ప్రభుత్వ తీరుని విమర్శిస్తున్నట్టుగా ఆ పోస్ట్ ఉంది.

అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పోలీస్ విచారణకు ఆదేశించడంతో.. మే 13న ఆమెపై బాలీగుంజె పోలీస్ స్టేషన్లో ఎప్.ఐ.ఆర్ నమోదైంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆ పోస్ట్ ఉందంటూనే.. పరువు నష్టం, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ తదితర సెక్షన్లు అన్నిటినీ అందులో కలిపేశారు. దీనిపై ఆమె హైకోర్టునుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. లాక్ డౌన్ తర్వాత తాను విచారణకు హాజరవుతానని చెప్పారు.

ఆ తర్వాత కోల్ కతా పోలీసులు ఆమెను విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపించారు. దీంతో మరోసారి ఆమె తనపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ రద్దు చేయాల్సిందిగా కలకత్తా హైకోర్టుని కోరారు. ఈ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే.. సెప్టెంబర్ 29న ఆమె పోలీస్ విచారణకు హాజరు కావాల్సిందిగా హైకోర్ట్ సూచించింది. దీనిపై రోషిని బిశ్వాస్ సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా పశ్చిమ బెంగాల్ పోలీసులను మందలిస్తూ పలు సూచనలు చేసింది.

ఇతర దేశాల్లో కూడా ఎవరైనా స్థానిక ప్రభుత్వాలపై ఫేస్ బుక్ పోస్ట్ లు పెడితే.. వారిని కూడా ఇలాగే విచారణకు పిలిపించగలరా అని పోలీసుల్ని ప్రశ్నించింది. సాధారణ ప్రజల్ని విచారణ పేరుతో ఇలా వేధించడం సరికాదని అంది. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన ఇతర రాష్ట్రాల ప్రజలకి ఇలా సమన్లు పంపి వేధిస్తారా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించాలని కోరింది.

అదే సమయంలో ఎఫ్.ఐ.ఆర్. రద్దు చేయాలంటూ పిటిషనర్ రోషిని బిశ్వాస్ పెట్టుకున్న అభ్యర్థనపై స్పందించాలని హైకోర్ట్ కి సూచించింది.