‘ పోలీసులు వెళ్లిపోతే… మాపై దాడి చేస్తారు ! ’

దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య… అనంతరం ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ లో… ఆ యువతి ఇంటి చుట్టూ ఇంకా పోలీసులు పహారా కాస్తున్నారు.  యాభైమంది ఆ ఇంటికి కాపలాగా ఉంటున్నామని,  త్వరలో సిఆర్ పిఎఫ్ సిబ్బంది (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) సైతం తమతో పాటు ఈ బాధ్యతలు తీసుకుంటారని యుపి పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన మొదట్లో హతురాలి కుటుంబం… ఠాకూర్ల నుండి తమకు రక్షణ కావాలని పోలీసులను కోరింది.

ఈ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం, ఒక ఇల్లు, ఒక ఉద్యోగం ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. ఇప్పటివరకు పదిహేను లక్షల రూపాయలు వారిపేరు మీద ట్రాన్స్ ఫర్ చేశామని, తరువాత మిగిలినది ఇస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు. వారికి ఇంటి సరుకులను సైతం అందజేస్తున్నామని, త్వరలోనే ఉద్యోగం, ఇల్లు సైతం సమకూరుతాయని ఆ అధికారులు తెలిపారు.

ఆ సంఘటన తరువాత తమ కుటుంబం బయటకువెళ్లి పని చేయటం లేదని… మరణించిన యువతి అన్న తెలిపాడు. గ్రామంలోని ఒక డైరీ షాపుకి పాలు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నామని, పశువులకు గడ్డి తెచ్చేందుకు ఒక మనిషిని పెట్టుకున్నామని, కానీ అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని అతను తెలిపాడు.

‘మేము బయటకు వెళితే ఎవరూ మమ్మల్ని పలకరించడం లేదు,  ఎవరి నుండీ మాకు అండ లేదు. మా కుటుంబం నుండి ఎవరు బయటకు వెళ్లినా ఇద్దరు ముగ్గురు పోలీసులు మాతో ఉంటున్నారు… మేము అలవాటు పడిపోయాం… కానీ గ్రామస్తులు మాత్రం మాకు దూరంగానే ఉంటున్నారు’ అన్నాడతను.

‘పదుల సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాం. ఎప్పుడూ ఇంత ఒంటరితనం అనుభవించలేదు. పోలీసులు ఉన్నారనే భయం వల్లనో లేదా నిందితుల వైపు ఉండటం వల్లనో తెలియదు కానీ ఎవరూ మాతో మాట్లాడటం లేదు. మాకు ఈ ఊరు వదిలి వేళ్లాలని లేదు కానీ… ఇక్కడ ఉండటం కూడా కష్టంగానే ఉంది. పోలీసులు వెళ్లిపోతే మాపైన దాడి జరుగుతుంది. మాకు వ్యతిరేకంగా కేకలు, అరుపులు వినబడుతాయి.’ అంటూ హతురాలి కుటుంబ సభ్యులు తమ భయాన్ని వ్యక్తం చేశారు.

సిబిఐ అధికారులు తమని, నిందితుల తరపు వాళ్లని ప్రశ్నించారని, ఇప్పుడు గ్రామస్తులను విచారిస్తున్నారని… ఫోరెన్సిక్ టీమ్ సంఘటన జరిగిన ప్రదేశం నుండి ఆధారాలను, తమ ఇంటినుండి తమ కుమార్తె దుస్తులు, నిందితుల ఇళ్లనుండి వారి బట్టలను సేకరిస్తున్నారని…వారు వెల్లడించారు.

పోలీసులు తమ గ్రామంలో అడుగడుగునా ఉండటం తమ రోజువారీ జీవితానికి ఇబ్బందిగా ఉందని గ్రామస్తుల్లో కొంతమంది అంటుండగా…  పోలీసుల వలన తమకేమీ ఇబ్బంది లేదని, తప్పు చేసిన వారికి శిక్షపడాలని, అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఉందని కొంతమంది చెబుతున్నారు.

గత ఏడాది ఈ సమయానికి తమ కుమార్తె దీపావళి కోసం ఇల్లంతా ముగ్గులతో అలంకరిస్తూ ఉందని, ఆమెని మర్చిపోలేకపోతున్నామని యువతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.