నాపై కులోన్మాది అంటూ ప్రచారం చేస్తున్నారు – సీపీఐ నారాయణ

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై సీపీఐ నారాయణ ఆగ్రహించారు. చంద్రబాబుకు నారాయణ, రామకృష్ణ అనుకూలంగా ఉంటున్నారన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. కమ్యూనిస్టులపైనే కులముద్ర వేయడం ఏమిటి అని ప్రశ్నించారు.

చంద్రబాబును మోస్తున్నారు, నారాయణ కులోన్మాది అంటూ తనపై మీడియాలో, సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. తన పిల్లలకు కూడా కులాంతర వివాహమే చేశానని నారాయణ వివరించారు.

గతంలో తాము టీడీపీనే కాకుండా పలు పార్టీలతో కలిసి పనిచేశామని… అప్పుడు తన కులం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జడ్జీలపై ఫిర్యాదు చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ.. ఆ లేఖను మీడియాకు విడుదల చేసే సంప్రదాయం ఉందా అని నారాయణ ప్రశ్నించారు.

గీతం వర్శిటీపైకి అర్థరాత్రి వందల మంది పోలీసులతో వెళ్లడం ఏమిటని అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే భవనాలను కూలగొట్టడం ఎవరికి లాభం అని నారాయణ నిలదీశారు.

ఇలా తమకు కులాన్ని ఆపాదించడం వైసీపీకి ఏమాత్రం మేలు చేయదని… ఈ పంథా నుంచి బయటకు వస్తే ఆపార్టీకే మంచిదని నారాయణ సూచించారు.