ప్రభుత్వ ఉద్యోగులు సినిమాల్లో, సీరియళ్లలో నటించకూడదు… కర్ణాటకలో కొత్త రూలు !

గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నవారు ఎవరూ సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో నటించకూడదంటూ కర్ణాటక ప్రభుత్వం ఓ కొత్త రూలు తీసుకువచ్చింది. కర్ణాటక స్టేట్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నిబంధనలు 2020 ముసాయిదా ప్రకారం… ప్రభుత్వ ఉద్యోగులు సినిమాల్లో, టీవీ సీరియళ్లలో నటించకూడదు. అంతే కాదు పుస్తకాలను సైతం ప్రచురించకూడదు.

తమ రాష్ట్ర, కేంద్ర, మరే ఇతర రాష్ట్రాల విధానాలను విమర్శించకూడదు. పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణల శాఖ… అక్టోబరు 27న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం  ప్రభుత్వ ఉద్యోగి సినిమాల్లో, టీవీ సీరియళ్లలో నటించాలన్నా, పుస్తకాన్ని ప్రచురించాలన్నా నిర్దేశిత అధికారులనుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గవర్నమెంటు ఉద్యోగులు రేడీయో, టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్లుగా కూడా వ్యవహరించకూడదు.

సదరు ముసాయిదా నోటిఫికేషన్ పై అభ్యంతరాలు ఉన్నవారు అది వెలువడిన పదిహేను రోజుల్లోగా ప్రభుత్వానికి తెలపాల్సి ఉంటుంది. అనంతరం త్వరలోనే దీనిని అమల్లోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిర్దేశిత అథారిటీ నుండి అనుమతి లేకుండా వ్యక్తిగత విదేశీ ప్రయాణాలు సైతం చేయకూడదని ప్రభుత్వం తెలిపింది.

అలాగే ప్రభుత్వ ఉద్యోగుల దుస్తులు గౌరవప్రదంగా ఉండాలని, ఆఫీసు సమయంలో డీసెంట్ డ్రస్ లనే ధరించాలని, ఒకవేళ యూనిఫామ్ ఉన్న ఉద్యోగాల్లో ఉన్నవారైతే… తప్పకుండా డ్యూటీలో ఉన్నపుడు యూనిఫామ్ ధరించాలని ప్రభుత్వం పేర్కొంది.

అంతేకాదు గవర్నమెంట్ ఉద్యోగులు కట్నం ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమ్మాయి తరపు వారిని లేదా అబ్బాయి తరపు వారిని కట్నం కోసం డిమాండ్ చేయకూడదని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.