మరో ప్రయోగానికి నో చెప్పిన మహేష్ బాబు

తన సినిమాల్లో ప్రయోగాలు చేయడానికి, మరీ ముఖ్యంగా తన లుక్ పై మేకోవర్లు చేయడానికి అస్సలు ఇష్టపడడు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించినప్పటికీ.. హెయిర్ స్టయిల్ మార్చుకోలేదు. సరికదా క్లీన్ షేవ్ లో ఉండాల్సిన మహేష్ కాస్తా.. చిన్న గడ్డం పెట్టుకొని మరీ కనిపించాడు. ఎందుకంటే తన లుక్ మార్చుకొని ప్రయోగం చేయడం మహేష్ కు ఇష్టం ఉండదు.

అలాంటి మహేష్ బాబు, తన కొత్త సినిమాలో మరో పెద్ద ప్రయోగానికి నో చెప్పాడు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. సర్కారువారి పాట సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. కానీ ఈ లాక్ డౌన్ టైమ్ లో తమన్ చెన్నైలో ఉండిపోవాల్సి వచ్చింది. మ్యూజిక్ సిట్టింగ్స్ కు కష్టమైంది.

అదే టైమ్ లో దర్శకుడు పరశురామ్ కు, సంగీత దర్శకుడు గోపీసుందర్ ను లైన్లోకి తీసుకురావాలని ఎప్పట్నుంచో ఉంది. అందుకే అతడితో రెండు ట్యూన్స్ కంపోజ్ చేయించి మహేష్ కు వినిపించాడు. కుదిరితే గోపీసుందర్ ను కూడా సర్కారువారి పాట సినిమా కోసం తీసుకుందామని ప్రపోజ్ చేశాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు.. ప్రయోగాలకు ఆమడదూరంలో ఉండే మహేష్, ఈ ప్రతిపాదనకు నో చెప్పేశాడు.