సంక్రాంతి బరిలో మరో సినిమా

ఇప్పటికే సంక్రాంతికి అరడజను వరకు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. నవంబర్ నుంచి ఆ సినిమాల విడుదల తేదీలు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక ఈ జాబితా ఆగుతుందని అంతా అనుకుంటున్న టైమ్ లో మరో సినిమా వచ్చి చేరింది. అదే ఉప్పెన.

అవును.. వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి ఈ సినిమా అన్నింటికంటే ముందే సిద్ధమైంది. కాకపోతే కొత్త నటీనటులు, కొత్త దర్శకుడితో చేసిన సినిమా కాబట్టి.. గట్టి పోటీ ఉండే సంక్రాంతి బరిలో దించడం ఎందుకని వెనక్కి తగ్గారు. మరీ ముఖ్యంగా వకీల్ సాబ్ మూవీ సంక్రాంతికి ఉంటుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నారు.

అయితే వకీల్ సాబ్ ఎప్పుడైతే సంక్రాంతికి రాదనే విషయం తేలిపోయిందో, ఉప్పెన కూడా క్యూ కట్టేసింది. ఇప్పటికే ఉన్న పోటీలో కొత్త హీరో వైష్ణవ్ తేజ్ కూడా చేరిపోయాడు.

రాబోయే సంక్రాంతి క్రాక్ సినిమాతో మొదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులకు ఒక సినిమా చొప్పున థియేటర్లలోకి రావాలనేది ప్లాన్. అలా మొత్తంగా 5 సినిమాల వరకు వస్తాయని చెబుతోంది ట్రేడ్. ఈ లెక్కన చూసుకుంటే ఆఖరి నిమిషంలో కొన్ని సినిమాలు డ్రాప్ అవుతాయన్నమాట.