పసిపిల్లలకు యాంటీబయోటిక్స్ వాడితే….?!

చిన్నపిల్లలకు యాంటీబయోటిక్స్ ఇవ్వవచ్చని చాలామంది చిన్నపిల్లల వైద్యులు భావిస్తుంటారు. కానీ రెండు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇవ్వటం మంచిది కాదని ఒక అధ్యయనంలో తేలింది.

రెండేళ్లలోపు పిల్లలకు ఈ మందులను ఇవ్వటం వలన వారిలో ఒబేసిటీ, అలర్జీలు లేదా కొన్నిరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. మయో క్లినిక్ ప్రొసీడింగ్స్ అనే పత్రికలో దాని తాలూకూ వివరాలను ప్రచురించారు.

14,500 మంది పిల్లలకు సంబంధించిన వైద్యపరమైన వివరాలను పరిశోధకులు సమీక్షించారు.  ఇందులో 70శాతం మంది తమ రెండేళ్లలోపు వయసులో కనీసం ఒక్కసారయినా యాంటీబయోటెక్స్ వాడినవారు. అయితే రెండేళ్లలోపు వయసులో ఎక్కువసార్లు యాంటీబయోటెక్స్ వాడినవారు తరువాత బాల్యంలో రకరకాల వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు గురయినట్టుగా పరిశోధకులు గుర్తించారు.

మందులు వాడినప్పుడున్న వయసు, ఏ మందులను ఎన్నిమోతాదుల్లో వాడారు… అబ్బాయా, అమ్మాయా… అనే అంశాలను బట్టి ఆరోగ్య సమస్యల తీవ్రత ఉన్నదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. రెండేళ్ల లోపు పిల్లలకు యాంటీబయోటెక్స్ వాడినప్పుడు అప్పటికి అవి వారి శరీరంలోని సూక్ష్మజీవులపై ప్రభావం చూపినప్పటికీ … దీర్ఘకాలంలో మాత్రం అస్తమా, ఒబేసిటీ, ఆహార అలర్జీలు, హైపరాక్టివిటీ డిజార్డర్ వంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయని అధ్యయనాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ పరిశోధనలతో… ఈ వయసు పిల్లలకు ఏ మందులను ఎంత మోతాదులో ఎన్నిసార్లు ఇవ్వవచ్చు… అనే అంశాలపై భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిపి చక్కని ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని అధ్యయన నిర్వాహకులు అంటున్నారు.