బీజేపీ మెడకు చుట్టుకున్న గుప్కార్ గ్యాంగ్ ఆరోపణలు…

గుప్కార్ గ్యాంగ్ అంటూ జమ్మూ కాశ్మీర్ కి తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కోరుతున్న పార్టీలపై విరుచుకుపడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ తర్వాత కాంగ్రెస్ నేతల విమర్శలతో తలబొప్పి కట్టింది.

గుప్కార్ గ్యాంగ్ అంటూ హేళన చేసిన ఆ గ్యాంగ్ లోని పీడీపీతో గతంలో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు మీ పాతివ్రత్యం ఏమైందని ఇప్పటికే కపిల్ సిబల్ అమిత్ షాకి తలంటారు కూడా. అదే సమయంలో గుప్కార్ గ్యాంగ్ లోని నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీతో ఏకంగా బీజేపీ అధికారం పంచుకున్న విషయంపై ఇప్పుడు మరింత దుమారం రేగుతోంది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ పేర్లతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో కార్గిల్, లేహ్ ప్రాంతాలకు హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లు ఏర్పడి ఉన్నాయి. వీటిలో లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (కార్గిల్ ) లో బీజేపీ, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలో ఉంది.

30 స్థానాలున్న ఈ కౌన్సిల్ లో 26మంది సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. వీరిలో నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ కి 10మంది, కాంగ్రెస్ కి 8మంది, బీజేపీకి ముగ్గురు, ఐదుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. 2018లో కౌన్సిల్ ఎన్నికలలో పీడీపీతో ఎన్సీకి పొత్తు ఉంది. అయితే పీడీపీకి చెందిన కౌన్సిలర్లు బీజేపీలోకి ఫిరాయించారు. అయినా కూడా బీజేపీలోకి ఫిరాయించిన కౌన్సిలర్లతో ఎన్సీ అధికారాన్ని పంచుకుంటోంది.

గుప్కార్ గ్యాంగ్ అంటూ ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీ.. పై దుమ్మెత్తిపోస్తున్న అమిత్ షా కి.. ఎన్సీతో అధికారాన్ని పంచుకుంటున్న విషయం గుర్తులేదా అంటూ చురకలంటిస్తున్నాయి ప్రతిపక్షాలు. దీన్ని బీజేపీ నేతలు సైడ్ ట్రాక్ చేస్తున్నారు.

లద్దాఖ్ బీజేపీ ప్రెసిడెంట్, స్థానిక ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నంగ్యాల్.. వివరణ మరీ విచిత్రంగా ఉంది. కాశ్మీర్ లో ఉన్న నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ వేరని, లద్దాఖ్ లో ఉన్న పార్టీ వేరని కొత్త లాజిక్ చెబుతున్నారాయన. ఫరూక్ అబ్దుల్లాకి.. కార్గిల్ ఎన్సీ పార్టీతో సంబంధం లేదని వితండవాడం చేస్తున్నారు. తాము లద్దాఖ్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ తో పొత్తులో ఉన్నామని స్పష్టం చేస్తూనే.. గుప్కార్ గ్యాంగ్ వివాదాన్ని మాత్రం తన వద్దకు తీసుకు రావద్దన్నారు ఎంపీ జమ్యాంగ్.

జమ్మూ కాశ్మీర్ లోని డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంలో.. ప్రతిపక్షాల కూటమిపై దుమ్మెత్తి పోయాలనుకున్న బీజేపీకి గుప్కార్ గ్యాంగ్ ఆరోపణ రివర్స్ లో తగిలింది. బీజేపీ కూడా అదే గ్యాంగ్ లో ఉందని తేలడంతో.. అందరూ అందరేనని మరోసారి రుజువైంది.