ట్విట్టర్ లో ట్యాగ్ చేసి…. పాత విషయాలను గుర్తుచేసిన బండ్ల గణేష్

చిరంజీవి, మోహన్ బాబు మధ్య అతిపెద్ద వివాదం జరిగింది. అదేంటనేది అందరికీ తెలిసిందే. లెజెండ్ ఎవరు, సెలబ్రిటీ ఎవరు అనే అంశంపై ఇద్దరూ నిండు సభలో వాగ్వాదానికి దిగారు. టాలీవుడ్ వజ్రోత్సవాల వేదికగా జరిగిన ఆ వివాదం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.

ఆ వివాదం తర్వాత ఏళ్లు గడిచాయి. చాన్నాళ్లు చిరు-మోహన్ బాబు ఎడమొహం-పెడమొహంగానే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో మారిన ఈక్వేషన్లు, కొత్త రాజకీయాల కారణంగా చిరంజీవి-మోహన్ బాబు మళ్లీ కలవాల్సి వచ్చింది. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారేందుకు విశేష కృషి చేస్తున్న చిరంజీవి.. నిండు సభలో మోహన్ బాబును కౌగిలించుకొని ముద్దుపెట్టారు. అక్కడితో వీళ్లిద్దరి మధ్య ఉన్న వివాదం దూది పిందెలా ఎగిరిపోయింది. ఆ తర్వాత చిరు బర్త్ డేకు మోహన్ బాబు ఇచ్చిన ఓ వెరైటీ గిఫ్ట్ (చెక్కతో చేసిన బుల్లెట్)తో ఇద్దరి మధ్య బంధం మళ్లీ పెనవేసుకుంది.

అప్పటి గొడవ తర్వాత ఏ వేదికపై సెలబ్రిటీ-లెజెండ్ అనే ప్రస్తావన రాలేదు. చివరికి సభల్లో యాంకర్స్ కూడా చిరంజీవి, మోహన్ బాబు ఉండే వేదికలపై ఈ రెండు పదాల్ని ఉపయోగించకుండా జాగ్రత్తపడ్డారు. ఇలాంటి అత్యంత సున్నితమైన పదాన్ని ఇప్పుడు బండ్ల గణేశ్ వాడారు.

ఇవాళ్టితో 45 ఏళ్ల కెరీర్ ను పూర్తిచేసుకున్నారు మోహన్ బాబు. ఈ సందర్భంగా అతడి 45 ఏళ్ల సినీప్రస్థానాన్ని తెలిపేలా ఓ వీడియో రిలీజ్ చేశారు తనయుడు మంచు విష్ణు. ఈ వీడియోను ట్యాగ్ చేసిన బండ్ల గణేశ్.. మోహన్ బాబును లెజెండ్ అన్నారు. మిమ్మల్ని తెలుగు లెజండరీ యాక్టర్ అని పిలిచేందుకు గర్విస్తున్నామంటూ ట్వీట్ పెట్టాడు.

బండ్ల పెట్టిన ట్వీట్ ఎవరి మనోభావాలు దెబ్బతీసి ఉంటాయో, ఏ హీరో ఫ్యాన్స్ హర్ట్ అయి ఉంటారో.. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.