జగన్ పేరుతో ఇంకెవ్వరూ ఉండకూడదా?

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార వాహనాలను కేసీఆర్‌… జగన్‌ ఎన్నికల ప్రచారం కోసం పంపించారని…. తెలంగాణలో జరిగిన ఎన్నికలకోసం ఏపీ వాహనాలు ఇక్కడకు వచ్చాయని ఫొటోలతో సహా సోషల్‌మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు.

మళ్ళీ అలాంటి ప్రచారమే ఇప్పుడు ఊపందుకుంది. జగన్‌ ఎన్నికల ప్రచారానికి వాడిన వాహనాలను హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఇక్కడకు పంపించాడని సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు, ఫొటోలు కూడా పెడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే హైదరాబాద్‌ జగద్గిరి గుట్ట నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వ్యక్తి వాడుతున్న ప్రచార రథం మీద ‘రావాలి జగన్… కావాలి జగన్‌‌’ అనే స్లోగన్‌ ప్రముఖంగా కనిపిస్తోంది. మిగిలిన వాహనమంతా కేసీఆర్, కేటీఆర్‌ ఫొటోలు గులాబీ రంగు కనిపిస్తున్నాయి.

కాబట్టి ఈ ఫొటోలను ప్రచురించి… మిగతా వాహనమంతా రంగు మార్చారు గానీ ‘రావాలి జగన్… కావాలి జగన్‌‌’ అనే స్లోగన్‌ మార్చడం మరిచిపోయారు… అంటూ టీడీపీ సోషల్‌ మీడియా వాలంటీర్లు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

అసలు నిజమేమిటంటే హైదరాబాద్‌ జగద్గిరి గుట్ట నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్‌గా పోటీ చేస్తున్న వ్యక్తి పేరు జగన్‌.

ఆయనకు ‘కావాలి జగన్‌… రావాలి జగన్‌’ అనే స్లోగన్‌ బాగా నచ్చి ఆ స్లోగన్‌ ను కొత్తగా రాయించుకున్నాడు తప్ప… ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచార రథాలు ఇక్కడికి వచ్చింది లేదు. ప్రచారం మాత్రం అలా జరిగిపోతోంది.