200 బాడీ వార్మ్ కెమేరాలతో ఎన్నికల నిఘా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రెగ్యులర్‌గా ఉండే సీసీ కెమేరాలు, పోలింగ్ బూత్‌లలో ఏర్పాటు చేసే వెబ్ కాస్టింగ్ కెమేరాలతో పాటు ఈ సారి 200 బాడీ వార్మింగ్ కెమేరాలను పోలీసులు ఉపయోగించనున్నారు.

ఈ సారి ఎన్నికలు అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంతే కాకుండా టికెట్లు దక్కని రెబెల్స్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉన్నది. పైగా ఈ సారి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో బూత్‌లలో గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో బాడీవార్మింగ్ కెమేరాలను పోలీసులు ఉపయోగిస్తున్నారు.

సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు బాడీవార్మింగ్ కెమేరాలను ఉపయోగిస్తుంటారు. ఎదుటి వ్యక్తి ఘర్షణ పడినప్పుడు ఎవరిది తప్పో ఈ కెమేరాల ద్వారా తెలిసిపోయేది. ఇప్పుడు ఎన్నికల సమయంలో పోలీసులపై తప్పులు నెట్టే అవకాశం ఉండటంతో బాడీవార్మింగ్ కెమేరాలను ఉపయోగించాలని పోలీసులు నిర్ణయించారు.

హైదరాబాద్‌లో దాదాపు 200 సున్నిత కేంద్రాలు, అతి సున్నితమైన కేంద్రాలను గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాల్లో ఈ కెమేరాలను ఉపయోగించనున్నట్లు తెలుస్తున్నది. కేవలం ఎన్నికల రోజే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీల్లో కూడా ఈ కెమేరాలతో నిఘా పెడుతున్నారు. గతంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కెమేరాలతో నిఘా పెట్టారు.

మరోవైపు గతంలో గొడవలు సృష్టించిన వాళ్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన వివరాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. వీరిపై ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టారు. అవసరమైతే వారిని బైండోవర్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.