మహిళల వీపులపైనుండి నడిచారు !

ఆధునిక విజ్ఞానం, మూఢనమ్మకాలు మనదేశంలో చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నాయి. ఎంతో సాంకేతిక ప్రగతిని సాధించాం అనే గర్వాన్ని అణచివేసేలా అనేక మూఢ విశ్వాసాలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. చత్తీస్ ఘర్ లో అలాంటి విపరీత సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పిల్లలు లేని వివాహిత మహిళలు నేలమీద బోర్లా పడుకుంటే… వారి వీపులపై నుండి కొంతమంది పూజారులు, భూత వైద్యులు నడిచారు. ఆ మహిళలు చత్తీస్ ఘర్ లోని ధంతరీ జిల్లాకు చెందినవారు.

పూజారులు భూతవైద్యులు తమపైన నడిచి వెళ్లి అంగార్ మోతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటే తమకు పిల్లలు పుడతారనేది ఆ మహిళల నమ్మకం. సంవత్సరానికి ఒకసారి మధాయి అనే పేరుతో జరిగే ఈ ఉత్సవాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాలనుండి వేల సంఖ్యలో గిరిజనులు హాజరవుతుంటారు. ఈ ఏడాది కరోనా ఉన్నప్పటికీ వేలాది మంది గిరిజనులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారంతా ఎలాంటి సామాజిక దూరం పాటించలేదు. మాస్కులు సైతం ధరించలేదు.

ఏటా దీపావళి తరువాత వచ్చే శుక్రవారం నాడు ఈ ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే ఈ ఏడాది కూడా మొన్న శుక్రవారం నాడు ఉత్సవం మొదలైంది. శనివారం మహిళలపై పూజారులు నడిచే కార్యక్రమం జరిగింది. యాభై గ్రామాలనుండి దాదాపు 200మంది మహిళలు… పిల్లలు పుడతారనే నమ్మకంతో గుడిముందు బోర్లా పడుకోగా…  డజన్ల కొద్దీ పూజారులు భూతవైద్యులు చేతుల్లో జెండాలు పట్టుకుని వారి వీపులపైన నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లారు. పిల్లలు పుడతారనే ఆశతో…. వేలమంది చూస్తుండగా… అనేకమంది మగవారు తమపై నడుచుకుంటూ వెళ్లడానికి వీలుగా నేలపై పడుకుని ఉండిపోయారు ఆ మహిళలు.

ఈ విషయంపై చత్తీస్ ఘర్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు కిరణ్మయి నాయక్ స్పందించారు.  తన టీమ్ తో వెళ్లి… అక్కడి ప్రజల సహకారంతో … ఈ ఆచారం మంచిది కాదనే అవగాహన కల్పిస్తామని కిరణ్మయి  అన్నారు. దేవత నుండి ఆశీర్వాదం పొందడానికి మంచి పద్ధతులు ఉన్నాయని చెప్పి వారు అంగీకరించేలా చేస్తామన్నారు. అయితే ఈ విషయంలో వారి మనోభావాలు దెబ్బతినకుండా కూడా జాగ్రత్తపడతామని ఆమె తెలిపారు.