ఉత్తరాదిన మళ్ళీ విజృంభిస్తున్న కరోనా…. భారత్ లో సెకండ్ వేవ్ ముంచుకొస్తోందా?

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తోందా? ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు దీనికి నిదర్శనమా? మహమ్మారి ప్రభావం తగ్గిపోయి జనజీవనం సాధారణ స్థాయికి చేరుకుంటున్న దశలో ఈ సెకండ్ వేవ్ వార్తలు కలవర పెడుతున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో సెకండ్ వేవ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం అంటున్నారు వైద్య నిపుణులు. దీంతో ఉత్తరాది రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. నవంబర్ 17 తర్వాత హర్యానాలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అప్పటి వరకూ తగ్గుతూ వచ్చిన కేసులు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 16వేలు పెరిగాయి. దీంతో అక్కడి స్కూల్స్ మూసివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నవంబర్ 30 వరకు హర్యానాలో స్కూల్స్ కి సెలవలిచ్చేశారు.

మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న భోపాల్, ఇండోర్, గ్వాలియర్, రత్లాం, విదిశ.. ఈ 5 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ ప్రకటించారు. రాత్రి 10గంటల తర్వాత ఎవరూ రోడ్లపైకి రావడానికి వీళ్లేదు. అలాగే ఉదయం 6గంటల తర్వాతే రోజువారీ కార్యకలాపాలు మొదలవుతాయి. అక్టోబర్ 14 తర్వాత మధ్యప్రదేశ్ లో తొలిసారిగా ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండటమే దీనికి కారణం. 9, 10 తరగతుల పిల్లలు, అది కూడా డౌట్స్ క్లియర్ చేసుకోడానికి మాత్రమే స్కూల్స్ కి రావాల్సి ఉంటుంది. మిగతావారందరికీ నిరవధికంగా సెలవలు ప్రకటించేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.

అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్ లో.. పూర్తిగా రాత్రివేళ కర్ఫ్యూ ప్రకటించింది గుజరాత్ సర్కార్. రాజస్థాన్ లో ఓ దశలో కరోనా కేసుల సంఖ్య రోజుకి వెయ్యికి పడిపోయింది. అయితే గత నాలుగురోజులుగా ఈ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 2,762 కేసులు నమోదు కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. 33 జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఉత్తర్ ప్రదేశ్ లో 4రోజులుగా కేసుల సంఖ్య పెరగడంతో… ప్రజలందర్నీ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ మొదలవుతుందనే అనుమానాలున్నాయని ఎవరికి వారే స్వీయ నిర్బంధం పాటించాలని సూచించింది. అక్టోబర్ 17 తర్వాత యూపీలో అత్యథిక కేసులు ఈనెల 20న నమోదయ్యాయి. ఒకరోజులోనే యూపీలో 2,858 కొత్తగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అయితే పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణలో కేసుల సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో దేశంలోనే రికార్డ్ స్థాయిలో కొవిడ్ కేసులు ఉన్న మహారాష్ట్రలో కూడా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం కొవిడ్ కేసుల పెరుగుదలతో సతమతమవుతున్నాయి. కేసుల భయం తగ్గుతున్న దక్షిణాదిలో ప్రజల జీవన విధానం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. మాస్క్ ల వాడకం తగ్గింది, సామాజిక దూరం మాయమైంది. ప్రజా రవాణా కూడా కిక్కిరిసిపోతోంది. ఉత్తరాది రాష్ట్రాలపై కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి.. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం మాత్రం ఉంది.