తరుణ్​ గొగోయ్​ ఆరోగ్యం విషమం..!

కాంగ్రెస్​ సీనియర్​ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగోయ్​ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నది. కొంతకాలం కిందట ఆయనకు కరోనా సోకగా చికిత్సతో నయమైంది. అయితే ప్రస్తుతం ఆయన గుండె, శరీరంలోని ఇతర అవయవాలు క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు గువాహటి వైద్యకళాశాల డాక్టర్లు తెలిపారు. ఆయన మల్టీ-ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నారని గువాహటి వైద్య కళాశాల వైద్యులు శనివారం తెలియజేశారు.

ప్రస్తుతం గొగోయ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అపస్మారక స్థితిలో ఉన్నట్లు అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. కరోనా సోకడంతో ఆగస్టు 25న తరుణ్​ గోగోయ్​ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన రెండు నెలలపాటు (అక్టోబరు 25) వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన అనంతరం తరుణ్ గొగోయ్ మళ్లీ అనారోగ్యం బారిన పడటంతో.. ఆయన కుమారుడు ఎంపీ గౌరవ్ గొగోయ్ నవంబరు 2న ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నది. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని.. గుండె కూడా సరిగ్గా పనిచేయడం లేదని వైద్యులు చెప్పారు. 48 గంటల వరకు ఏ విషయం చెప్పలేమని శనివారం రాత్రి వైద్యులు ప్రకటించారు.

కాగా ఆయన కోలుకోవాలని కాంగ్రెస్​ నేతలు ట్వీట్లు పెడుతున్నారు. 1 ఏప్రిల్​, 1936 వ సంవత్సరంలో తరుణ్​ గొగోయ్​ జన్మించారు. ఆయన 2001 నుంచి 2016 వరకు అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తరుణ్​ గోగోయ్​.. అస్సాంలో కాంగ్రెస్​ పార్టీని వరుసగా మూడుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. 15 ఏళ్ల పాటు అంటే మూడు పర్యాయాలు అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పారు. తరుణ్​ గోగోయ్​ తండ్రి కమలేశ్వర్​ గోగోయ్​ వైద్య నిపుణుడు. తరుణ్​ గోగోయ్​ అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఉన్న జగన్నాథ్ బరూవా కళాశాలలో గ్రాడ్యుయేషన్​, అస్సాంలోని గౌహతి విశ్వవిద్యాలయం నుండి ఎల్​ఎల్​బీ పూర్తి చేశాడు. ఇందిరా ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన గోగోయ్​ ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు.

1971–85 వరకు జోర్హాట్‌ పార్లమెంట్​ నియోజకవర్గానికి, 1991–96, 1998-2002 మధ్యకాలంలో కాలియాబోర్ పార్లమెంట్​ స్థానానికి ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్​ పార్టీ పరమైన పలు కీలక పదవులను కూడా నిర్వర్తించారు. 1976 లో ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా ఎంపికయ్యారు. పీవీ నరసింహారావు హయాంలో ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 2001లో ఆయన అస్సాంకు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా మూడు పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్​ను గెలిపించారు. తరుణ్​ గోగోయ్​ తొందరగా కోలుకోవాని కాంగ్రెస్​ శ్రేణులు పూజలు చేస్తున్నారు.