రైతులకు మద్దతుగా సిక్కు మత గురువు ఆత్మహత్య

కొత్త వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. రైతులకు మద్దతుగా సిక్కు మత గురువు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. రైతుల ఆందోళనలో హర్యానా గురుద్వారాకు చెందిన బాబా రామ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఢిల్లీ- సోనిపేట బోర్డర్‌ కుండ్లికి సోమవారం సాయంత్రం చేరుకున్నారు. రైతుల నిరసనలో పాల్గొన్న ఆయన… రైతులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చనిపోతున్నట్లు లేఖ రాశారు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రైతుల ఆందోళన 22వ రోజుకు చేరింది. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కేంద్రం వారికి న్యాయం చేయడం లేదు. వారి బాధను పంచుకున్నా… రైతులకు మద్దతుగా కొందరు తమ అవార్డులను వెనక్కి ఇచ్చారు… కానీ నేను నా ప్రాణాలు త్యాగం చేయాలని అనుకుంటున్నా అని లేఖ రాసి బాబా రామ్‌సింగ్‌ చనిపోయారు.

మోదీ సర్కార్‌ క్రూరత్వంతో వ్యవహరిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. బాబా రామ్ సింగ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఇటు అకాళీదళ్‌ కూడా కేంద్రం వైఖరిపై దుమ్మెత్తి పోసింది. రైతుల నిరసనపై స్పందించకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.

నవంబర్‌ చివరివారం నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాదాపు పదివేల మంది రైతులు వంటావార్పు చేసుకుంటున్నారు. సరిహద్దుల్లోనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆందోళనలో పాల్గొన్నవారిలో 20 మంది నిరసనకారులు చనిపోయారు.