పోటీ చేస్తారా? హైదరాబాద్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా?

బీజేపీ, జనసేన మధ్య తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిపై ప్రతిష్టంభన తొలగిపోకముందే పవన్ కల్యాణ్ ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా ముందస్తుగా నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తల్లో జోష్ నింపారు.

తాజాగా జనసేన కార్యనిర్వాహక కమిటీ పేరుతో 10మంది సభ్యులతో ఓ టీమ్ తయారు చేశారు. తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, జనసేన విధి విధానాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో శ్రేణులను సమన్వయం పరచుకుంటూ పార్టీ కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా, ప్రజా సమస్యలను, రాజకీయ సంబంధ విషయాలను అధినేతకు తెలియజేయడం ఈ కమిటీ పని.

ఒకరకంగా ఈ కమిటీ ఏర్పాటుతో తిరుపతి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిత్వంపై మరింత క్లారిటీ ఇచ్చినట్టయింది. అయితే నిజంగానే తిరుపతి నుంచి కూటమి తరపున జనసేన అభ్యర్థి బరిలో దిగుతారా లేక ఇదంతా కేవలం హడావిడి మాత్రమేనా అనే విషయం తేలాల్సి ఉంది.

గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో కూడా ఇలాగే హడావిడి చేసి ఉసూరుమనిపించారు పవన్ కల్యాణ్. అభ్యర్థులను ప్రకటించినంత పని చేశారు, బి-ఫారాలిస్తాం ఆఫీస్ కి రమ్మని, తాను మాత్రం బీజేపీతో చర్చలకు వెళ్లారు. విస్తృత ప్రయోజనాలకోసం అంటూ చివరకు బీజేపీకి త్యాగం చేశారు. ఇప్పుడు కూడా పవన్ హడావిడి చూస్తుంటే.. మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందేమోననే అనుమానం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది.

పార్టీ తరపున కార్యనిర్వాహక కమిటీ వేసేంత భరోసా ఉన్నప్పుడు తిరుపతి అభ్యర్థిపై ప్రకటన చేసి ఉండొచ్చు కదా అనే ప్రశ్న కూడా వినపడుతోంది. ఒకవేళ బీజేపీ హామీ ఇవ్వకపోతే ఇలాంటి కమిటీలు వేసి కార్యకర్తల్ని మరింత అయోమయంలోకి నెట్టడం పవన్ కి ఇబ్బందిగా పరిణమిస్తుంది కానీ, మేలు చేయదు. క్షేత్ర స్థాయిలో జనసేన కార్యకర్తలు పార్టీకోసం పనిచేసి, చివరకు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయండి అని చెప్పడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. పదే పదే త్యాగాలు చేయాలంటే కార్యకర్తలకు అధినేతపై నమ్మకం కుదరదు. మరి పవన్ ఏ ఉద్దేశంతో రాజకీయ కమిటీ వేశారో, తిరుపతి సీటుపై ఆయనకి బీజేపీ అధిష్టానం ఏమని భరోసా ఇచ్చిందో.. మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.