తొలి టీకా నాకొద్దు.. ప్రధాని మోదీ మెలిక

దేశవ్యాప్తంగా ఈనెల 16నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే తొలి టీకా ప్రధాని వేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలంటున్న ప్రతిపక్షాల రాద్ధాంతాన్ని ఆయన తెలివిగా తిప్పికొట్టారు. తొలి దశ టీకాలో ప్రజా ప్రతినిధులకు చోటు లేదంటూ.. తనతోపాటు మంత్రివర్గ సహచరులదరికీ మినహాయింపు ఇచ్చేసుకున్నారు మోదీ.

టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతిచ్చిన వేళ, అంత హడావిడి ఎందుకంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. కరోనా టీకా సమర్థతపై పలు సందేహాలు వెలిబుచ్చాయి. అదే సమయంలో తొలి టీకా ప్రధాని వేసుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలని, ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా తొలి విడత టీకా వేయాలని, ఆ తర్వాతే దాన్ని జన బాహుళ్యంలోకి తేవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తొలి విడత వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపాల్టీ సిబ్బంది.. ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకా వేస్తారని, వీరంతా దేశానికి గొప్ప ఆస్తి అని.. అలాంటి వారిపై తొలి దశ ప్రయోగాలు చేయొద్దని విమర్శించారు. ఇతర దేశాల్లో కూడా ప్రజా ప్రతినిధులు తొలి దశ టీకా వేయించుకుని ప్రజల్లో భరోసా నింపారని సూచించాయి. ఈ విమర్శలపై ప్రభుత్వ వర్గాలేవీ తక్షణం స్పందించలేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. తొలి దశ కేవలం ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మాత్రమేనని, ప్రజా ప్రతినిధులు ఫ్రంట్ లైన్ వారియర్స్ కాదని అందుకే వారిని తొలి విడత నుంచి దూరంగా పెట్టామని, దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దని అన్నారు మోదీ.

టీకా పనితీరు గురించి తగిన సమాచారం లేకుండానే వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామన్న విపక్షాల ఆరోపణలు సబబు కాద‌న్న‌మోదీ.. పౌరులకు సమర్థమైన వ్యాక్సిన్లు అందేలా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తల తీసుకున్నారని చెప్పారు. టీకాల విషయంలో శాస్త్రవేత్తలదే తుది నిర్ణయమని, అత్యవసర అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లు భారత్ లోనే తయారు కావడం గర్వకారణం అని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 దేశాల్లో 2.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందితే మన దేశంలో జనవరి 16 నుంచి మొదలయ్యే కార్యక్రమంలో 3 కోట్ల మంది కరోనా వారియర్స్ సహా మొత్తం 30 కోట్ల మందికి టీకా అందిస్తామని తెలిపారు మోదీ. కేవలం నెలల వ్యవధిలోనే 30కోట్ల మందికి టీకా వేయడం ప్రపంచంలోనే అతి పెద్ద కసరత్తుగా నిలిచిపోతుందని చెప్పారు. తొలివిడతలో మూడు కోట్ల మంది యోధులకు కరోనా టీకా ఇచ్చేందుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.