భోగి వేడుకల చుట్టూ రాజకీయాలు

రాజకీయ పార్టీలన్నీ మతం చుట్టూనే తిరుగుతుండడం వర్తమాన భారత్ ప్రత్యేకత. మెజార్టీ మతస్తులను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. హిందూ మతానికి ఏకైక ప్రతినిధిగా చెప్పుకునే బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలూ అదే దారిని అనుసరిస్తున్నాయి. సంక్రాంతి వేడుకల్ని సైతం రాజకీయాలకు కేంద్రంగా మలిచే ప్రయత్నం చేయడమే అందుకు నిదర్శనం.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ మతం చుట్టే తిరిగాయి. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పంథాను కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ మత రాజకీయాలనే నమ్ముకుంది. అందుకే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా భాగలక్ష్మి ఆలయం చుట్టూ హడావిడి చేసింది. తాము గ్రేటర్ లో అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుతామంటూ హామీ ఇచ్చింది కూడా. తాజాగా అధికార పార్టీ సైతం భాగ్యలక్ష్మి ఆలయంపై దృష్టిసారించింది.

తెలంగాణ జాగృతి భోగి వేడుకలను చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించింది. టీఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత తెల్లవారుజామునే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భోగి వేడుకల్లో పాల్గొంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నుంచి ప్రజలు బయటపడాలని కోరుకున్నారు. త్వరలోనే కరోనా రహిత ప్రపంచాన్ని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్నా మొన్నటి దాకా భాగ్యలక్ష్మి ఆలయం చుట్టూ బీజేపీ తిరుగుతుంటే, ఇప్పుడు అదే ఆలయాన్ని టీఆర్ఎస్ ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ తో పాటు, కేంద్ర హోం మంత్రి సైతం భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పోరేటర్లు సైతం భాగ్యలక్ష్మి ఆలయం వద్దే ప్రమాణం చేశారు. ఈ మొత్తం క్రమంలో అధికారపార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. కాగా… టీఆర్ఎస్ శ్రేణులు సైతం గట్టి సమాధానం ఇచ్చాయి. కేసీఆర్ ను మించిన హిందువు లేడంటూ తమ నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత భాగ్యలక్ష్మి ఆలయం వద్దే భోగి వేడుకలు నిర్వహించడం తాము కూడా మెజార్టీ మతస్తుల పక్షమేనని చాటుకోవడం కోసమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీ సంక్రాంతి వేడుకల్ని రాజకీయాలకు కేంద్రంగా మలుచుకుంది. ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసింది. మున్సిపల్ చట్టాల్లో సవరణలకు ఉద్దేశించిన 196, 197,198 జీవో కాపీలను తెలుగుదేశం నేతలు దగ్ధం చేశారు. పనిలో పనిగా తాను ప్రజా పక్షపాతినని నిరూపించుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. తానేం తప్పు చేసానో తనకు తెలీదని, ప్రజలంతా అభివృద్ధి చెందాలనుకున్నాని, అదే తాను చేసిన తప్పైతే క్షమించాలని కోరారు. మొత్తానికి సంక్రాంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు కేంద్రంగా మారాయి.