పతంగులు వరల్డ్ ఫేమస్…

సంక్రాంతి వచ్చిందంటే.. గాలిపటాలు ఆకాశాన్ని అందుకునేలా పైపైకి ఎగురుతంటాయి. పిల్లల సందడి సంగతి అయితే చెప్పే పనే లేదు. అయితే అసలు, గాలిపటాలను ఎగరేసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని మీకు తెలుసా.. విదేశాల్లో కూడా గాలిపటాల పండగ గ్రాండ్ గా జరుపుకుంటారు. అలాంటి కొన్ని వేడుకలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బాలి, ఇండొనేషియా
బాలిలో అంతర్జాతీయ పతంగుల పండుగకు జరుగుతుంది. ఇది వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్. ఇక్కడ 4 నుంచి 10 మీటర్ల వెడల్పుతో పెద్దపెద్ద పతంగులను తయారు చేస్తారు. వీటికి సుమారు వంద మీటర్ల తోక ఉంటుంది. అదే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. కొన్ని గాలిపటాలకు కంపించే ధనస్సును కూడా అతికిస్తారు. దాని ప్రకంపనల శబ్దం నేలమీదికి వినిపిస్తుంది. దీన్ని అక్కడి భాషలో ‘గువాంగ్‌’ అంటారు.

వీఫెంగ్‌, చైనా
చైనాలోనే ముందుగా పతంగులు పుట్టాయని చెప్తుంటారు. ప్రపంచంలోని అతిపెద్ద కైట్‌ మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. ప్రాచీనకాలంలో డ్రాగన్ల ఆకారంలో పతంగులను ఎలా తయారు చేసేవారో ఇక్కడ చూడొచ్చు. చైనాలోని వీఫెంగ్ లో ప్రతి ఏప్రిల్‌లో అయిదు రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను జరుపుతారు.

కేప్‌టౌన్‌, దక్షిణాఫ్రికా
ప్రపంచంలోనే మరో పెద్ద కైట్ ఫెస్టివల్.. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ లో జరుగుతుంది. ఇక్కడ వేలల్లో జనాలు గుమిగూడి వందల కొద్దీ గాలిపటాలను ఎగురవేస్తారు. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి, ఈ ఫెస్టివల్ ను చూడడానికి వేల సంఖ్యలో వివిధ దేశాల నుంచి వస్తారు.

హమమత్సు, జపాన్‌
జపాన్‌లో కూడా కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతుంది. జపాన్ లోని హమమత్సు ప్రాంతంలో నాలుగు వందల ఏళ్ల క్రితం హమమత్సు రాజకుటుంబంలో మగశిశువు పుట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున పతంగులను ఎగురవేశారట. అప్పటి నుంచీ ఈ ఆచారం అలా వస్తూ ఉంది. ఇక్కడ భారీ గాలిపటాలను ఎగురవేస్తుంటారు.