చిన్నారుల వ్యాక్సినేషన్ పై క్లారిటీ..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ముందు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు, ఆ తర్వాత ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది క్యూలో ఉన్నారు, నెక్స్ట్ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కోటా ఉంది. ఆ తర్వాత సామాన్య ప్రజలు, అందులోనూ 50ఏళ్లు పైబడి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మొదటి ప్రయారిటీ. ఈ లిస్ట్ లో మరి చిన్నపిల్లలు ఎక్కడ? అసలు చిన్నారులకు వ్యాక్సిన్ ఇస్తారా? ఇస్తే ఎప్పుడిస్తారు, పెద్దవారిలాగా రెండు డోసులు సరిపోతాయా? లేక ఒకదానితోనే సరిపెడతారా..? ఆ ప్రశ్నలన్నటికీ ఇప్పుడు సమాధానం దొరికింది. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాటల ప్రకారం చిన్నారులకు ఇప్పుడప్పుడే వ్యాక్సినేషన్ ఇవ్వరు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కొవిషీల్డ్, కొవాక్సిన్ ప్రయోగాలేవీ చిన్నారులపై జరగలేదు కాబట్టి.. వాటిని ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. మరి పిల్లల Covid-19సంగతేంటి? ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలలో స్కూళ్లు మొదలయ్యాయి. సమూహాలుగా చేరడంలో ఉండే రిస్క్ పిల్లలకు బాగా ఎక్కువ. మరి వారికి వ్యాక్సినేషన్ ఎప్పుడు మొదలు పెడతారనే ప్రశ్నలు తలెత్తాయి.

చిన్నారులకు ఇచ్చే వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఈ పాటికే కసరత్తులు ప్రారంభించింది. కొవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ నాజల్ వ్యాక్సిన్ కి అనుమతులకోసం ప్రయత్నిస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసింది. ఫిబ్రవరి లేదా మార్చిలో మొదటి దశ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహిస్తుంది. సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్ ‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం భారత్ లో ఈ వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకా ఒకడోసు మాత్రమే ఉంటుంది. ఇంజక్షన్ ద్వారా ఇచ్చే టీకాను తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలని ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చిన్నారుల విషయంలో రిస్క్ తీసుకుంటారా..?
కొవాక్సిన్ మూడో దశ ప్రయోగాలకంటే ముందే మార్కెట్లోకి రావడంతో దేశంలో అలజడి రేగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తయిన గంటల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వారి మరణాలకు వేర్వేరు కారణాలున్నాయని చెబుతున్నా.. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి రిస్క్ చేయరు అని చెప్పుకోవాలి. ఒకవేళ నాజల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దాని ప్రభావం తేలే వరకు పేరెంట్స్ ముందడుగు వేసే అవకాశమే లేదు. చిన్నారులకు నాజల్ టీకాయే వేస్తారని తేలినా.. అది అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుంది.