ప్రతిపక్ష నాయకుడి విడుదల కోసం ఆందోళనలు

ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని ఈ నెల 17న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టు వార్త వినగానే దేశంలోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. చిన్నగా మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు దేశాన్ని అట్టుడికిస్తున్నాయి. నావల్నిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు, అభిమానులు రోడ్లపై పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తున్నారు.

రష్యాలో ప్రస్తుతం శీతాకాలం కావడంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అంత చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నావల్ని మద్దతుదారులే కాకుండా సామాన్య ప్రజలు, విద్యార్థులు కూడా వేల సంఖ్యలో ఈ ర్యాలీల్లో స్వచ్చంధంగా పాల్గొంటుండటం గమనార్హం. రోజు రోజుకూ నిరసనలు పెరిగిపోతుండటంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొడుతున్నారు. వారిని అడ్డుకునేందకు లాఠీ చార్జ్ చేస్తున్నారు.

రష్యాలోని 90 నగరాల్లో జరుగుతున్న ఈ ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటున్న నాయకులను గుర్తించి దాదాపు 3 వేల మందిని అదుపులోనికి తీసుకున్నారు. అయినా సరే నిరసనలు ఆగడం లేదు. ఆందోళనల్లో పాల్గొన్న నావల్నీ భార్య యూలియాను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం