రంగంలోకి పెద్దన్న.. కేంద్రానికి మద్దతు ప్రకటించిన అమెరికా

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన చుట్టూ భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళనకు రిహన్నా, గ్రెటా థన్‌బర్గ్‌, కమలా హారిస్‌ మేన కోడలు మీనా హారిస్‌ లాంటి ప్రముఖులు మద్దతు ప్రకటించగా పలువురు బాలీవుడ్ సినీతారలు కేంద్రంతో గొంతుకలిపారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరమంటూ తేల్చారు. ఇప్పుడీ వ్యవహారంపై అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించింది.

భారతదేశం తీసుకువచ్చిన నూతన చట్టాలు దేశీయ మార్కెట్ సామర్థ్యాన్ని పెంచుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాలకు మద్దతిస్తున్నామన్న ఆయన, భారతదేశ మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందన్నారు. అదే సమయంలో శాంతియుత నిరసనలు అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య లక్షణంగా పేర్కొన్నారు.

రైతు సమస్యల పరిష్కారానికి చర్చలే పరిష్కార మార్గమని అమెరికా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. భారతీయ మార్కెట్ మెరుగుపరిచేందుకు ద్వైపాక్షిక నేస్తంగా అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను అమెరికా స్వాగతిస్తుందని, తద్వారా రైతులకు మరింత ఆదాయం లభిస్తుందని విదేశాంగ శాఖ అభిప్రాయ పడింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని భారత ప్రభుత్వం సాధిస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించింది.

కాగా.. పలువురు అమెరికా ప్రజా ప్రతినిధులు రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తుండడం గమనార్హం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ సభ్యురాలు హేలీ స్టీవెన్స్ వ్యాఖ్యానించారు. మరో కాంగ్రెస్ సభ్యురాలు ఇల్లామ్ ఒమర్ సైతం రైతులకు మద్దతు ప్రకటించారు. కాగా.. వ్యవసాయ రంగంలో సంస్కరణలను ఆమోదించలేని ఓ చిన్న వర్గం మాత్రమే నిరసనలకు దిగుతోందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు.. రైతు ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు తెలపడంపై అమిత్‌ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ప్రచారమూ దేశ ఐక్యతను దెబ్బ తీయలేదన్నారు.