దిల్ రాజుకు తొలి ఎదురుదెబ్బ పడినట్టే!

ఇన్నాళ్లూ నైజాంలో ఎదురులేకుండా శాసించాడు దిల్ రాజు. పెద్ద సినిమాను నైజాంలో రిలీజ్ చేయాలంటే దిల్ రాజే గతి. ఆయన చెప్పిన రేటే ఫైనల్. థియేటర్లు కూడా ఆయనకే ఎక్కువ. అలా దాదాపు దశాబ్దకాలంగా నైజాంలో దిల్ రాజు హవా నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆచార్య రూపంలో దిల్ రాజుకు భారీ షాక్ తగిలింది.

ఆచార్య సినిమా నైజాం రైట్స్ కోసం దిల్ రాజు కోట్ చేసిన మొత్తం 36 కోట్ల రూపాయలు. సైరా సినిమా 32 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది కాబట్టి, దిల్ రాజు 36 కోట్లు చెప్పారు. కానీ  వరంగల్ శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ మాత్రం 40 కోట్ల రూపాయలకు ఈ రైట్స్ ఎగరేసుకుపోయాడు.

కొన్నాళ్లుగా నైజాంలో దిల్ రాజుకు వరంగల్ శ్రీను పోటీగా నిలిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్, క్రాక్ సినిమాల్ని నైజాంలో ఇతడే రిలీజ్ చేశాడు. విరాటపర్వం, శ్రీకారం సినిమాల్ని కూడా ఇతడే దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆచార్య నైజాం రైట్స్ దక్కించుకొని సంచలనం సృష్టించాడు.

నైజాంలో దిల్ రాజు ఆధిపత్యానికి గండికొట్టేందుకు, కొంతమంది కావాలనే వరంగల్ శ్రీనును ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.