అల్లరోడికి సూపర్ స్టార్ సపోర్ట్

అల్లరినరేష్, మహేష్ కలిసి మహర్షి అనే సినిమా చేశారు. ఆ టైమ్ లోనే ఇద్దరి మధ్య మంచి బాండింగ్
ఏర్పడింది. అంతకంటే ముందే ఇద్దరికి పరిచయం ఉన్నప్పటికీ, మహర్షి తర్వాత బాగా క్లోజ్ అయ్యారు. ఆ
అనుబంధంతో అల్లరోడి సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు మహేష్ బాబు. అల్లరినరేష్ నటించిన
నాంది సినిమా ట్రయిలర్ ను తన ట్విట్టర్ ఖాతా నుంచి రిలీజ్ చేశాడు. ట్రయిలర్ చాలా బాగుందని
మెచ్చుకున్నాడు కూడా.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే, రాజ‌గోపాల్ అనే ఓ పేరుపొందిన వ్య‌క్తి హ‌త్య‌కు గురైతే, ఆ హ‌త్యానేరం దానితో ఏ
సంబంధ‌మూ లేని సూర్య‌ప్ర‌కాష్ అనే యువ‌కుడిపై ప‌డుతుంది. అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీగా ఐదేళ్లు అత‌ను
జైలులోనే మ‌గ్గిపోతాడు. అస‌లు హంత‌కులు సూర్య‌ప్ర‌కాష్ ఆ హ‌త్య చేశాడ‌ని రుజువు చేయ‌డానికి అన్ని
ర‌కాల అక్ర‌మ మార్గాలు అనుస‌రిస్తారు. అత‌డిని నానా ర‌కాలుగా హింసిస్తారు. చివ‌రికి ఏం జ‌రిగింద‌నేది
సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. గ‌గుర్పాటు క‌లిగించే అనేక ఇంటెన్స్ సీన్స్‌తో ట్రైల‌ర్ ఆద్యంతం
ఎమోష‌న‌ల్‌గా క‌నిపిస్తోంది.

త‌న కెరీర్‌లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్‌ను ఈ సినిమాలో న‌రేష్ పోషించారు. సూర్య‌ప్ర‌కాష్‌ను నిర్దోషిగా
నిరూపించ‌డానికి అత‌ని త‌ర‌పున వాదించే డిఫెన్స్ లాయ‌ర్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, పబ్లిక్
ప్రాసిక్యూట‌ర్‌గా శ్రీ‌కాంత్ అయ్యంగార్ క‌నిపించారు. కీల‌కమైన పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో హ‌రీష్ ఉత్త‌మ‌న్‌,
అల్ల‌రి న‌రేష్ తండ్రిగా దేవీప్ర‌సాద్ న‌టించారు.