రైతుల కోసం ‘శ్రీకారం’

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీ‌కారం’‌. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ న‌టిస్తోంది. 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

లేటెస్ట్‌గా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సినిమా కంటెంట్ ఏమిటి, శ్రీ‌కారం క‌థ ప్ర‌యోజ‌న‌మేమిటి? అనే విష‌యాల‌ను ఈ టీజ‌ర్ స్ప‌ష్టంగా తెలియ‌జేస్తోంది. నిజజీవిత ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ సినిమాని
రూపొందించిన‌ట్లు పేర్కొన్నారు. హీరో శ‌ర్వానంద్ చెప్పిన‌ రెండు డైలాగ్స్ ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్‌ను వెల్ల‌డిస్తున్నాయి.

“ఒక హీరో త‌న కొడుకుని హీరోని చేస్తున్నాడు.. ఒక డాక్ట‌ర్ త‌న కొడుకుని డాక్ట‌ర్‌ని చేస్తున్నాడు.. ఒక ఇంజ‌నీర్ త‌న కొడుకుని ఇంజ‌నీర్‌ని చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్ర‌మే త‌న కొడుకుని
రైతుని చేయ‌డం లేదు. ఈ ఒక్క‌టీ.. నాకు జ‌వాబులేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది.”

“తినేవాళ్లు మ‌న నెత్తిమీద జుట్టంత ఉంటే, పండించేవాళ్లు మూతిమీద మీస‌మంత కూడా లేరు.” అనేవి ఆ రెండు డైలాగ్స్‌.

శ‌ర్వానంద్ మాట‌ల్ని బ‌ట్టి ఆయ‌న ఒక రైతు కొడుక‌నీ, తండ్రి బాట‌లో తాను కూడా రైతుగా మారేందుకు శ్రీ‌కారం చుట్టాడ‌నీ ఈజీగా అర్థం చేసుకోవ‌చ్చు. అయితే రైతుగా అత‌ని ప్ర‌యాణం సాఫీగా సాగిందా, ఏమైనా అడ్డంకులు ఎదుర‌య్యాయా? అస‌లు బాగా చ‌దువుకొని కూడా రైతు కావాల‌ని అత‌ను ఎందుకు నిర్ణ‌యించుకున్నాడు? అనే ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లకు సినిమా స‌మాధానం చెప్ప‌నుంది.