తెరపైకి శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్

ఓవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఓ కొలిక్కి వస్తున్నప్పటికీ మరోవైపు చరణ్ తన తదుపరి చిత్రం ఏంటనే విషయాన్ని బయటపెట్టలేదు. ఈ విషయంలో రామ్ చరణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత లోకల్ గా సినిమా చేయడం ఆయనకు ఇష్టం లేదు. ఆ హై-రేంజ్ ను అలానే కొనసాగిస్తూ, మరో పెద్ద సినిమా చేయాలనేది చెర్రీ ప్లాన్. ఇందులో భాగంగా ఓ బడా దర్శకుడు రంగంలోకి దిగాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే శంకర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యేలా ఉంది. వీళ్లిద్దర్నీ కలిపే బాధ్యతను నిర్మాత దిల్ రాజు భుజానికెత్తుకున్నాడు. ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న దిల్ రాజు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి శంకర్ తో చర్చలు జరుపుతున్నాడు.

నిజానికి దిల్ రాజు, శంకర్ మధ్య మంచి అనుబంధం ఉంది. అన్నీ కుదిరితే ఇండియన్-2 సినిమాకు దిల్ రాజే నిర్మాతగా ఉండాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా దిల్ రాజు తప్పుకున్నాడు. ఇప్పుడు చరణ్ సినిమా కోసం మరోసారి శంకర్ ను కలిశాడు రాజు. ఇప్పటివరకు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయని శంకర్.. దిల్ రాజు ప్రపోజల్ ను అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి.