కొత్త నోటిఫికేషన్ ఇస్తే జనసేన సత్తా చూపిస్తాం..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. దీనిపై హైకోర్టులో అప్పీల్ కి వెళ్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. లాక్ డౌన్ ముందు జరిగిన పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీ నాయకులు బెదిరించి మరీ ఇతరుల్ని నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు పవన్ కల్యాణ్. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేని వారికి మరో అవకాశం కల్పించాలని ఆయన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

తూతూమంత్రంగా ఫిర్యాదుల స్వీకరణ..
పరిషత్ ఎన్నికల విషయంలో నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియపై గతంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ అనుమానం వ్యక్తం చేశారు. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తామంటున్న ఆయన, గతంలో బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేని వారికి, బెదిరింపుల వల్ల ఉపసంహరించుకున్నవారికి మరో అవకాశం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈమేరకు కలెక్టర్లు ఫిర్యాదులు స్వీకరించి తనకు నివేదికలు ఇవ్వాలని కోరారు. అయితే పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికై, రిటర్నింగ్ అధికారుల వద్ద ఫామ్-10 కూడా స్వీకరించిన విజేతలు, ఎస్ఈసీ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ కోర్టుకెక్కారు. ఫామ్-10 జారీ చేసిన చోట ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించొద్దని, మిగతా చోట్ల ఫిర్యాదులు తీసుకున్నా దానిపై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఎస్ఈసీ నిర్ణయానికి అడ్డుకట్ట వేసింది. విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది. ప్రస్తుతం కలెక్టరేట్లలో ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతున్నా, వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ అభ్యంతరం తెలిపారు. నామినేషన్లు వేయని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం చెప్పినా అది అమలయ్యే అవకాశం కనిపించడం లేదని అన్నారు పవన్ కల్యాణ్. తమ పార్టీ అభ్యర్థులు తగిన ఆధారాలతో అధికారులను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదులు తీసుకుని పంపించేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో ఆలోచించడం లేదన్నారు. అధికారుల తీరుతో ఆ ప్రక్రియపై నమ్మకం పోయిందని పేర్కొన్నారు.

కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే..
గతంలో జరిగిన నామినేషన్ల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని అంటున్న పవన్ కల్యాణ్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. జనసేన లీగల్‌ విభాగంతో చర్చించి, హైకోర్టులో అప్పీల్‌ చేస్తామని తెలిపారు. న్యాయపోరాటం చేసైనా సరే కొత్త నోటిఫికేషన్ సాధించుకుంటామని చెప్పారు పవన్.