రజనీ మద్దతు కోరిన కమల్​హాసన్​..!

తమిళనాట రాజకీయాలు వేగంగా కదులుతున్నాయి. ఓ వైపు డీఎం అధినేత స్టాలిన్​, ఆయన పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార అన్నాడీఎంకే నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే జైలు నుంచి విడుదలైన శశికళ కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అయితే కొన్నేళ్ల క్రితమే మక్కల్​ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన కమల్​హాసన్​ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీచేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఈ సారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. ఎప్పటికప్పుడు తన పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.

కమల్ హాసన్ బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీంతో ఆయన ప్రగతిశీల భావజాలం ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చూశారు. కానీ ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆయన ఒంటరిగానే ముందుకెళ్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కమల్​హాసన్​.. రజనీకాంత్​ మద్దతు కోరారు. ఇందుకు రజనీ అంగీకరించారో? లేదో? తెలియదు. నిజానికి రజనీకాంత్​ కూడా ఈ సారి పార్టీ పెట్టాలని భావించారు. పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు కూడా అభిమానులు కూడా ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అయితే ఎందుకో ఆయన ఆఖరినిమిషంలో పార్టీ పెట్టడం లేదని ప్రకటించేశారు. ఆదివారం చెన్నైలో కమల్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం కట్చి నాలుగో వసంతం వేడుక జరిగింది. ఇందులో పార్టీ నేతలతో మాట్లాడే సమయంలో తలైవాకు పరోక్షంగా కమల్‌ పిలుపునిచ్చారు. రండి కలిసి పనిచేద్దాం..అని పిలుపునిస్తూ వ్యాఖ్యలు చేశారు.

అయితే రజనీ మాత్రం ప్రస్తుతం ఆయనకు మద్దతు తెలపలేదని సమాచారం. రజనీకాంత్​ భావాలు కొంత బీజేపీకి దగ్గరగా ఉంటాయి. ఆయన అధ్యాత్మిక రాజకీయాలు చేద్దామని భావించారు. రజనీ పార్టీ పెట్టడం వెనక బీజేపీ కూడా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. రజనీకాంత్​ మాత్రం ఈ సారికి సైలెంట్ గానే ఉండబోతున్నారు. ఏపార్టీకి మద్దతు తెలపకుండా.. వ్యతిరేకంగా ఉండకుండా తటస్థంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకవేళ మద్దతు తెలపాల్సి వస్తే బీజేపీ లేదా దాని మిత్రపక్షాలకు ఆయన సపోర్ట్ ఇవ్వొచ్చు.