పుదుచ్చేరిలో ఏం జరుగుతోంది..! అంతా తమిళ సై చేతుల్లోనే..!

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అక్కడ లెఫ్టినెంట్​ గవర్నర్​గా ఉన్న కిరణ్​బేడీని మార్చి ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్​ తమిళ సై సౌందర్​రాజన్​ను ఇంచార్జిగా నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఉన్నట్టుండి కొందరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. శాసనసభలో బలపరీక్ష నిరూపించుకోవడంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి విఫలమయ్యారు. దీంతో ఎల్​జీ తమిళ సైకి రాజనామా సమర్పించారు.

అయితే అక్కడ ఎన్నికలు పెడతారా? కొంతకాలం రాష్ట్రపతి పాలన పెట్టబోతున్నారా? ఏం జరగుబోతున్నదని ఆసక్తి నెలకొన్నది. అయితే గవర్నర్​ మార్పు.. కాంగ్రెస్​ రాజీనామాల వ్యవహారం చూస్తుంటే.. ఒకవేళ బీజేపీ ఏమైనా స్కెచ్​ వేసిందా? అని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎలాగూ త్వరలో తన పదవీకాలం పూర్తికానుండటంతో సీఎం నారాయణస్వామి కూడా రాజీనామా సమర్పించారు..

లెఫ్టినెంట్​ గవర్నర్​ .. బీజేపీకి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్లు తమకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సీఎం నారాయణస్వామిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ.. ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల బీజేపీకి పెద్దగా లాభం ఉండదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత రంగస్వామిని పిలవొచ్చు. అయితే ఇంత తక్కువ కాలం పాటు సీఎం కుర్చీ ఎక్కడానికి ఆయన ఇష్టపడతారా? అన్నది కూడా ప్రశ్నార్థకమే. అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరి బీజేపీ నియంత్రణలో ఉన్నట్టే..

అయితే ప్రస్తుతం బీజేపీ కావాలనే అక్కడ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే రాబోయే ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో మళ్లీ కాంగ్రెస్​ అధికారం చేపట్టే అవకాశం ఉంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్​ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో? అని ఆసక్తి నెలకొన్నది.