విశాఖ ఉక్కుపై మోదీ క్లారిటీ ఇచ్చినట్టేనా..?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ఉద్యమిస్తోంది. అసెంబ్లీ తీర్మానానికి సై అన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై ఒత్తిడి తెస్తానంటోంది. అయితే కేంద్రం మాత్రం విశాఖ ఉక్కు సహా ఇతర ఏ ప్రభుత్వ రంగ సంస్థల విషయంలోనూ వెనక్కి తగ్గే యోచనలో లేనట్టు అర్థమవుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బడ్జెట్ లో పెట్టుబడుల ఉపసంహరణకోసం ప్రకటించిన కార్యక్రమాలపై వెబినార్ లో పాల్గొని తమ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించుకున్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వారసత్వం పేరుతో నడపడం దేశ ఆర్థిక వ్యవస్థకు భారమని అన్నారు మోదీ. అలాంటి వాటిని నడపడం ఎంతమాత్రం సమంజసం కాదని, ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. 100 ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు రాబట్టాలని నిర్ణయించినట్లు తెలిపారాయన.

అన్నీ ప్రైవేటుకే..
నాలుగు వ్యూహాత్మక రంగాల్లోని అతి కొద్ది సంస్థల్ని తప్ప మిగతా అన్నిటినీ ప్రైవేటీకరించేందుకు ఎన్డీఏ సర్కారు కట్టుబడి ఉందని చెప్పారు మోదీ. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను తీసుకొచ్చినప్పుడే మోదీ దూకుడు అందరికీ అర్థమైంది. అయితే ప్రజా పోరాటాలతో కానీ, రాష్ట్రాల ఒత్తిడితో కానీ మోదీ మెత్తబడతారేమోనని అనుకున్నారంతా. కానీ ఆ ఆశలన్నీ అడియాశలనేనని తేటతెల్లమవుతోంది. బ్యాంకింగ్‌ , ఇన్సూరెన్స్‌ , ఎరువులు, పెట్రోలియం, రక్షణ రంగాలకే ప్రభుత్వ పాత్ర పరిమితం కాబోతోందని స్పష్టం చేశారు. వీటిలో కూడా అన్ని సంస్థలనూ ప్రభుత్వం తన వద్ద ఉంచుకోదని ముందుగానే హింట్ ఇచ్చేశారు.

ప్రైవేటీకరణ వ్యవహారాన్ని గట్టిగా సమర్థించుకున్న ప్రధాని మోదీ, దానికి మద్దతుగా తనదైన లాజిక్ లు చెబుతున్నారు. 50-60 ఏళ్ల క్రితం ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించిన నాటి పరిస్థితులు వేరని, కాలానికి అనుగుణంగా వాటిలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు మోదీ. కేవలం ప్రభుత్వం రంగంలో ఉండటం వల్లే.. చమురు, సహజ వాయువు, విద్యుత్తు వంటి రంగాలను వాటి సామర్థ్యం మేరకు వాడుకోలేకపోతున్నామని అన్నారాయన. ప్రైవేటు పరం చేస్తే అధునాతన సాంకేతికతను తీసుకువస్తుందని, యాజమాన్య ధోరణిలో మార్పులొస్తాయని, అగ్రశ్రేణి మేనేజర్లతో ప్రపంచంలోని ఉత్తమ విధానాలను అనుసరించడానికి ఆస్కారం ఉంటుందని, మొత్తం వ్యవస్థ సామర్థ్యమే పెరుగుతుందని చెప్పారు. ప్రైవేటీకరణ ద్వారా వచ్చే సొమ్ముని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానత, సురక్షిత తాగునీటి సరఫరా, చౌకలో గృహ నిర్మాణం వంటివి పెంచడానికి ఉపయోగిస్తామని కూడా చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు చవి చూస్తే వాటి ద్వారా ప్రజలపైనే భారం పడుతుందని అన్నారు మోదీ. పన్ను చెల్లింపుదారుల డబ్బు ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని. పేదలు హక్కుదారులుగా ఉన్న డబ్బును ప్రభుత్వ రంగ సంస్థలకోసం వెచ్చించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు అనే పేరెత్తలేదు కానీ.. అంతకు మించి అన్నిటి గురించీ వివరించారు ప్రధాని మోదీ. ప్రైవేటీకరణ వల్ల కలిగే లాభాలు, నష్టాలున్న కంపెనీలను ప్రభుత్వం దగ్గరే ఉంచుకుంటే జరిగే విపరీతాలు, ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అని చెప్పే నీతి సూక్తులు.. ఇలా మోదీ ప్రసంగం ఆద్యంతం ప్రైవేటీకరణను సమర్థించేలా సాగింది. విశాఖ ఉక్కు కాదు కదా, ఇతర ఏ కంపెనీ విషయంలోనూ కేంద్రం వెనక్కి తగ్గదని మోదీ మాటల్ని బట్టి అర్థమవుతోంది.