సముద్రంలోకి దూకేసిన రాహుల్​.. దాని వెనక ఓ స్కెచ్​ ఉంది..!

రాహుల్​గాంధీలో ఓ విలక్షణమైన రాజకీయనేత ఉంటాడు.. కానీ చాలా ఆశ్చర్యకరంగా దాన్ని ఎవరూ గుర్తించరు. ప్రజలతో వ్యవహరించే తీరులోనూ వివిధ వృత్తుల వాళ్లను పలకరించే విధానంలోనూ రాహుల్​ ఓ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. కానీ ఆయన మీద ఓ ముద్రతో అవన్నీ పక్కకు పోతాయి. ప్రస్తుతం రాహుల్​గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. బుధవారం ఆయన కేరళలో కొల్లాంకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి మత్స్యకారులతో ముచ్చటించారు. వాళ్ల సాదకబాదకాలు తెలుసుకున్నారు.

అనంతరం రాహుల్ అక్కడి అరేబియా సముద్రంలో దూకారు. ఆ టైంలో ఆయనవెంట మత్స్యకారులు కూడా ఉన్నారు. అయితే చేపలు పట్టడం ఎంత కష్టమైన పనో తెలుసుకోవడానికి ఆయన సముద్రంలోకి దూకారట. రాహుల్​గాంధీ సముద్రంలోకి దూకబోతున్నట్టు ఆయన భద్రతాసిబ్బందికి గానీ.. ఆయన వెంట ఉన్న అనుచరులకు గానీ తెలియదు . దీంతో వాళ్లు ఒక్కసారిగా షాక్​ అయ్యారు. నిజానికి రాహుల్​ మంచి ఈతగాడు. కాబట్టి అతడు సముద్ర ఈతను ఎంజాయ్​ చేశాడు. ఆయన దాదాపు 10 నిమిషాలపాటు ఈత కొట్టాడు. అంతకుముందు రాహుల్​గాంధీ మత్స్యకారులతో మాట్లాడి వాళ్ల కష్టసుఖాలను తెలుసుకున్నారు.
రాహుల్ గాంధీ సముద్రంలో దూకిన సమయంలో బ్లూ టీ షర్టు, ఖాకీ ప్యాంటు ధరించి ఉన్నారు. రాహుల్​ ఈతకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె. సి. వేణుగోపాల్, టి.ఎన్.ప్రతాపన్ సహా నలుగురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

అనంతరం రాహుల్​గాంధీ కాసేపు పడవలో ప్రయాణించారు. మత్స్యకారులతో కలిసి చేపలు, రొట్టె ఆరగించారు. అయితే త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్​ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.