వారసులకు అవకాశం.. మాట నిలబెట్టుకున్న సీఎం..

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. మొత్తం ఆరు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో అసెంబ్లీ బలాబలాలను బట్టి ఆరింటికి ఆరు వైసీపీనే కైవసం చేసుకుంటుంది. అంటే ప్రస్తుతం వైసీపీ ప్రకటించిన అభ్యర్థులంతా రేపు ఎమ్మెల్సీలు అయినట్టే లెక్క.

వారసులకు అవకాశం..
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఆయన తనయుడు కల్యాణ్ చక్రవర్తికి అదే స్థానంలో జరిగే ఉప ఎన్నికలకు అవకాశం ఇస్తారని అనుకున్నారంతా. అయితే ఆ స్థానాన్ని ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తికి ఖరారు చేసిన జగన్, బల్లి కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇస్తామని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.

ఇటీవలే మరణించిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు జగన్. ఇక టెక్కలి వైసీపీ ఇన్ చార్జి దువ్వాడ శ్రీనివాస్ కి కూడా వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు జగన్. టెక్కలిలో అచ్చెన్నాయుడిని నిలువరించే వ్యూహంలో భాగంగా దువ్వాడకు అవకాశమిచ్చారు.

సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్యకు కూడా ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు జగన్. మరో ఎమ్మెల్సీ అభ్యర్థి, హిందూపురం వైసీపీ ఇన్ ‌చార్జ్ అహ్మ‌ద్ ఇక్బాల్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి కూడా. హిందూపురంలో ఆయన బాలకృష్ణకు గట్టి పోటీ ఇచ్చారు. విజయవాడకు చెందిన కరీమున్నీసాకు మహిళా కోటాలో అవకాశం దక్కింది. మొత్తం ఆరుగురిలో ఇద్ద‌రు మైనార్టీల‌కు అవకాశం ఇవ్వడం గమనార్హం.
మార్చి 29వ తేదీతో న‌లుగురు ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ఎమ్మెల్సీగా రాజీనామా చేసి, రాజ్యసభకు వెళ్లిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ స్థానంతోపాటు, చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి ఆకస్మిక మృతితో మ‌రో స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో మొత్తం ఆరు స్థానాల‌కు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈరోజునుంచి మొదలైన నామినేషన్ల కార్యక్రమానికి మార్చి 4తో గడువు ముగుస్తుంది. మార్చి 5న నామినేష‌న్ల ప‌రిశీల‌న‌, 8వ తేదీ ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు విధించారు. మార్చి 15న పోలింగ్ జరుగుతుంది.