సిద్దిపేట జిల్లాలో కరోనా కలకలం.. స్కూల్లో 22 మందికి కరోనా లక్షణాలు..

తెలంగాణకు కరోనా సెకండ్​ వేవ్​ వచ్చేసింది. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా సెకండ్​ వేవ్​ మొదలైన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కూడా అలర్టయ్యింది. అయితే ఇప్పటికే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలోని ఓ స్కూల్​లో కరోనా కేసులు కలకలం సృష్టించాయి.

సిద్దిపేట జిల్లాలోని కొండపాక ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. దీంతో ఆ స్కూల్​లోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 22 మంది విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండటంతో వాళ్లకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఫలితాలు రేపు వచ్చే అవకాశముంది.

కరోనా వైరస్ లక్షణాలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ఖిలా వరంగల్ మండల పరిధిలో పది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఓవైపు వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొన్నది.

విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే ఎంతో భయంగా ఉందని వాళ్లు అంటున్నారు. తెలంగాణలో ఇటీవల పాఠశాలలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళనకు గురిచేస్తున్నది.