ఈత తెచ్చిన చిక్కులు.. రాహుల్​పై కేరళ సీఎం సెటైర్లు..!

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ఇటీవల కేరళలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. సముద్రంలో సరదాగా ఈత కూడా కొట్టారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి. కాగా కేరళలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్​ మత్స్యకారులను మచ్చిక చేసుకొనేందుకు సముద్రంలో ఈత కొట్టడం, చేపలు పట్టడం వంటి పనులు చేస్తున్నారని కొందరు విమర్శించారు.

కాగా కేరళ సీఎం పినరయి విజయ్​ కూడా రాహుల్​పై విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఢిల్లీలో ఇబ్బందులను లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు. జాతీయ నేతగా చెప్పుకొనే రాహుల్​ గాంధీ మాత్రం రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా కేరళ టూర్​ను ఎంజాయ్​ చేస్తున్నారు.

ఆయన ఇక్కడ ఈత కొడుతూ.. పర్యాటక ప్రదేశాలను చూస్తూ.. చేపలను రుచి చూస్తూ ఎంజాయ్​ చేస్తున్నారు.. అంటూ ఆయన ధ్వజమెత్తారు. రాహుల్​ గాంధీకి నిన్న చేసిన స్విమ్మింగ్​ రాజకీయంగా కలిసివస్తుందని.. త్వరలో జరిగే కేరళ ఎన్నికల్లో కొంచెమైనా పనిచేస్తుందని.. మత్స్యకారులు ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్​ నేతలు భావించగా రాహుల్​ పర్యటన బెడిసి కొట్టింది. రాహుల్​ పర్యటనపై ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు చేయగా తాజాగా కేరళ సీఎం కూడా విమర్శలు గుప్పించారు.

రాహుల్ గాంధీ రైతుల సమస్యలను పూర్తిగా మరిచిపోయారని కేరళ సీఎం విమర్శించారు.కాగా పినరయి విజయ్​ వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేశారు. రాహుల్​కు వచ్చిన గుర్తింపును చూసి ఓర్వలేక ఆయన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.