ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా పాకిస్థాన్‌ను భారత్‌లో విలీనం చేసుకుంటామని .. అఖండ భారతం నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. దేవుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని చెప్పారు. దీన్ని ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘దేశ విభజన అసాధ్యమని బ్రిటీష్ పార్లమెంట్లో లార్డ్ వేవెల్ అభిప్రాయపడ్డారు. తొలి ప్రధాని నెహ్రూ కూడా దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విభజన మూర్ఖులు చేసే పని ఆయన అన్నారు. కానీ అప్పట్లో ఎందుకంత హడావుడిగా దేశ విభజన చేశారో తెలియదు. ఎప్పటికైనా పాకిస్థాన్ భారత్‌తో కలవాల్సిందే. ఆ రోజు మరెంతో దూరంలో లేదు’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అఖండ భారత్‌ను ఏర్పాటు చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అయితే తాజాగా భగవత్ ఆ కోణంలోనే మాట్లాడారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ద్వి సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ రచించిన ‘విశ్వభారతం’ అనే పుస్తకాన్ని గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.
అఖండ భారత్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు మనతో విడిపోయి ఎంతో నష్టపోయాయని చెప్పారు.అవన్నీ మళ్లీ పునరేకీకరణ కావాల్సి ఉందని చెప్పారు. సహనం, ఓర్పు వంటి గుణాలకు మనదేశం కేంద్రం అని ఆయన పేర్కొన్నారు. భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. అక్కడ నిత్యం అశాంతి నెలకొంటుందని చెప్పారు. ప్రతి హిందువు సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. అహంకారం విడనాడాలని పేర్కొన్నారు. ఇవాళ మోహన్‌భాగవత్ ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు.