కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. అసలేంటి కథ..?

కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారంలోకి తీసుకు రావాలని పదే పదే నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలను వినీ విననట్టే ఉన్న చంద్రబాబు కాసేపు మౌనాన్ని ఆశ్రయించారు, ఆ తర్వాత లోకేష్ సహా ఇతర నాయకుల్ని కూడా ప్రచారానికి తెస్తానని చెప్పారు. కుప్పంలో జూనియర్ ప్రస్తావన ఎందుకొచ్చిందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ తో పార్టీకి ప్రచారం చేయించారు చంద్రబాబు. అప్పట్లో జూనియర్ కూడా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు, తాతని గుర్తు తెచ్చేలా ఖాకీ యూనిఫామ్ లో సందడి చేశారు. ఆ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రచారానికి దూరమయ్యారు. అయితే తాత పార్టీకి మనవడు చేసిన ప్రచారం సరిపోలేదు, టీడీపీకి వైఎస్ఆర్ చేతిలో వరుసగా రెండో సారీ పరాభవమే ఎదురైంది. ఆ ఎన్నికల తర్వాత జూనియర్ ని పూర్తిగా పక్కనపెట్టి, కొడుకు లోకేష్ ని ప్రమోట్ చేసుకున్నారు బాబు. ఎన్టీఆర్ సినిమాల విడుదల సమయంలో థియేటర్లు దొరక్కుండా చేశారనే అపవాదు కూడా బాబుపై ఉంది. నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఆయన కుమార్తె, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినికి కూకట్ పల్లి టికెట్ ఇవ్వడంతో నందమూరి-నారావారి కుటుంబ వ్యవహారం చక్కబడుతుందని, ఎన్టీఆర్ తిరిగి టీడీపీకి దగ్గరవుతారని భావించారంతా. అక్క తరపున ప్రచారానికి తమ్ముళ్లెవరూ వెళ్లకపోవడంతో దూరం మరింత పెరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ వైరి పక్షాలు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించి చంద్రబాబుని ఆయన కొడుకు లోకేష్ ని దెప్పి పొడుస్తున్నారే కానీ, పార్టీలో మాత్రం ఎన్టీఆర్ ప్రస్తావన లేదు, రాలేదు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం పాలైన తర్వాత, పంచాయతీ ఎన్నికల్లో సాక్షాత్తూ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే పూర్తిగా పార్టీ పడకేసిన సందర్భంలో ఇప్పుడు మరోసారి జూనియర్ ప్రస్తావన తీసుకొచ్చారు కార్యకర్తలు. పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామంటూ చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజే ఈ పేరు బయటకు రావడం యాదృచ్ఛికమా లేక, పథకం ప్రకారం జగిరిందా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ యాదృచ్ఛికమే అయితే.. టీడీపీ అనుకూల మీడియా ఆ అంశానికి అంత ప్రాధాన్యం ఇవ్వదు. అయితే టీడీపీ అనుకూల మీడియా కూడా జూనియర్ వ్యవహారాన్ని హైలెట్ చేసి చూపిస్తోంది, దీంతో తెరవెనక ఏదో జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలోనే క్లారిటీ ఇచ్చారు, ఆయన్ని తెరపైకి తెస్తే కొడుకు మరుగున పడిపోతాడనే భయం బాబులోనూ ఉంది. ఈదశలో చంద్రబాబు అంత సాహసం చేయరు. మరి కార్యకర్తల నినాదాలకు కారణం ఏంటి? ఈ నినాదాలను బాబు పూర్తిగా తొక్కిపెట్టేస్తారా..? లేక కుప్పం మూడోరోజు పర్యటనలో మరింత పెరుగుతాయా..? వేచి చూడాలి.