వ్యాక్సిన్ తీసుకున్న మోదీ!

కరోనా వ్యాక్సిన్ మీద చాలా మందికి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సీన్స్ అన్నింటిని తక్కువ టైంలో తయారు చేయడమే దీనికి కారణం. అయితే, ఈ వ్యాక్సిన్ పై అనుమానాల్ని తొలగించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడన్ లైవ్లో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయన అడుగుజాడల్లో చాలామంది నాయకులు, అటుపై అమెరికా పౌరులు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకొచ్చారు.

కానీ, మన దేశంలో బహిరంగంగా నాయకులు వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ఇంకా అనుమానాలు పెరిగిపోయాయి. ఇంతలోనే కరోనా యుద్ధంలో ముందు నిలిచిన వైద్య సిబ్బంది, పారుశుద్ధ్య, పొలీసు వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయింది. ఇక, మార్చి ఒకటి నుంచి అరవై ఏళ్లు పైబడినవాళ్లంతా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. అయితే, ప్రధాని మోదీకి 70 ఏళ్లు కదా? మరి ఆయనే తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? ఈ విమర్శలు ఇంకా పెద్దవి కాకముందే.. సోమవారం పొద్దున ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ కి వెళ్లి.. మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్ తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.

నొప్పే తెలియలేదు

మోదీకి సిస్టర్ పి. నివేద వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే, ఆమెకు పొద్దున్నే డ్యూటీ ఉందని కాల్ వచ్చిందట. కానీ, తాను వ్యాక్సిన్ వేయబోయేది మోదీకని ఆమెకు తెలియదు. ఆస్పత్రిలో మోదీని చూశాకా ఆశ్చర్యంతో పాటు, సంతోషంలోమునిగిపోయినట్టు చెప్పారామె. పొద్దున్న 6.25 కే మోదీ ఆస్పత్రికి చేరుకున్నారు. ‘వ్యాక్సీన్ తీసుకున్నాక.. అప్పుడే వేశారా! అసలు వేసుకున్నట్టే అనిపించలేదు’ అని నర్సుతో అన్నారు.

పగటి పూట వస్తే ఆస్పత్రికి వచ్చేవాళ్లతో పాటు, రోడ్డు మీద ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుందని మోదీ మార్నింగ్ స్లాట్ ని బుక్ చేసుకున్నారని పీఎంవో తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నతర్వాత ‘‘ ఎయిమ్స్ లో కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాను. మన సైంటిస్టులు, డాక్టర్లు కరోనా పోరాటంలో వేగంగా పని చేసిన తీరు ప్రశంసనీయం. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని నేను కోరుతున్నాను. అందరం కలిసి.. కోవిడ్ రహిత భారతదేశంగా మారుద్దాం!‘అని ఆయన ట్వీట్ చేశారు.