ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు రాజకీయ డ్రామా – పెద్దిరెడ్డి ధ్వజం..

రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు రాజకీయ డ్రామా ఆడారని, తన అనుకూల మీడియాతో ఆ డ్రామాని రక్తి కట్టించుకోడానికి ప్రయత్నించారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తే చంద్రబాబు గాంధీ అయిపోతారా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్, కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నిబంధనలకు వ్యతిరేకంగా చిత్తూరులో నిరసనకు దిగాలని చూడటం సరికాదని అన్నారు. 14ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఆమాత్రం నియమ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. కుప్పంలో ఘోర పరాభవం తర్వాత చంద్రబాబుకి ఏం చేయాలో తెలియలేదని, పదే పదే చిత్తూరులో అక్రమాలు జరిగిపోతున్నాయనే భ్రమ కల్పించేందుకు ప్రయత్నించారని, చివరిగా నిరసన ప్రదర్శనతో శాంతి భద్రతల సమస్యలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూసి విఫలమయ్యారని అన్నారు.

చిత్తూరులో చంద్రబాబు రాజకీయాలకు నూకలు చెల్లాయని, టీడీపీ కోటలకు బీటలు పడ్డాయని, భవిష్యత్తులో చంద్రబాబు ఉనికే రాజకీయాల్లో ఉండదని అన్నారు. పంచాయతీల్లో 80శాతం విజయాలు వైసీపీవేనని, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూడా తమదే ఘన విజయం అని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ తరపున పోటీచేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులాగా తాము కూడా వలసల్ని ప్రోత్సహించి ఉంటే.. టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగిలి ఉండేవారు కారని అన్నారు. గతంలో మంత్రి పదవుల ఆశ చూపి ఎమ్మెల్యేలను లాక్కొని, వైసీపీని బలహీన పరిచేందుకు చంద్రబాబు కుట్ర చేశారని అన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు సైతం వైసీపీకి మద్దతు తెలుపుతుంటే చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే ఎన్నికల హామీలన్నిటినీ అమలు చేసి వైసీపీ ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తోందని, అందుకే స్థానిక సంస్థల్లో తమకు విజయం దక్కిందని అన్నారు పెద్దిరెడ్డి.

గతంలో ప్రతిపక్షనేతగా ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు జగన్ విశాఖ వెళితే చంద్రబాబు ప్రోద్బలంతో పోలీసులు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసని అన్నారు పెద్దిరెడ్డి. ఎయిర్ పోర్ట్ లో రన్ వే పైనే జగన్ ను అడ్డగించి వెనక్కి పంపించారని గుర్తు చేశారు. కానీ వైసీపీ హయాంలో పోలీసులు అలా చేయలేదని చంద్రబాబుతో గౌరవంగా ప్రవర్తించారని అన్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చిత్తూరుకి రావొద్దని ముందుగానే పోలీసులు సూచించినా శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారని విమర్శించారు. ఎయిర్ పోర్ట్ లో పోలీసులు చంద్రబాబుతో గౌరవంగా ప్రవర్తించారని, సమయానికి భోజనం సహా అన్ని వసతులు సమకూర్చారని, కానీ ఆయన కావాలని నేలపై కూర్చుని హంగామా సృష్టించారని అన్నారు.

వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండేలా ఆంక్షలు విధించడంపై మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వలంటీర్లకు రాజకీయాలు పులమడం సరికాదన్నారు. వైసీపీకోసం పనిచేయాలని వలంటీర్లకు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. వారు పార్టీ మనుషులు కాదని, ప్రభుత్వం కార్యక్రమాలు, సంక్షేమం కార్యక్రమాలను ఇంటింటికీ ఇచ్చేందు కోసం పనిచేస్తున్నారని చెప్పారు.