దీదీని కలిసిన తేజస్వియాదవ్​.. బీహారీలంతా దీదీవైపేనా?

త్వరలో పశ్చిమబెంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయపరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మళ్లీ పగ్గాలు చేపట్టబోయేది దీదీయే నంటూ పలు సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే బీజేపీకి గతం కంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకున్నది. ఇప్పటికే ఆపరేషన్​ ఆకర్ష్​కు తెరలేపింది.

అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే మమతా కూడా వ్యూహాలకు పదునుపెడుతున్నది. మరోవైపు ఆమెకు ఐప్యాక్​ సంస్థ నిర్వాహకుడు, ప్రశాంత్​కిశోర్​ అతడి టీం సలహాలు ఇస్తున్నది. ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని.. ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్​ కలిశారు. బీహారీలంతా మమతేకే మద్దతు ఇవ్వాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు. బీజేపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిణామం బెంగాల్​ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తేజస్వి యాదవ్​ పిలుపుతో కొన్నివర్గాల ప్రజలు దీదీకి మద్దతు తెలపవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రాబోయే ఎన్నికలు ‘‘ఆదర్శాలు, విలువలను కాపాడుకునేందుకే’’నని తేజస్వి చెప్పారు. ‘‘మా పార్టీ మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది’’ అని తేజస్వియాదవ్​ పేర్కొన్నారు. మరోవైపు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) 28 మంది పరిశీలకులను బెంగాల్​కు పంపించింది. బెంగాల్​లో జరుగుతున్న రాజకీయాలపై వాళ్లు అధ్యయనం చేస్తున్నారు. అయితే పశ్చిమబెంగాల్​లో 8 విడతల్లో ఎన్నికలు జరపడాన్ని కాంగ్రెస్​ తప్పుపడుతున్నది.

ఈ మేరకు ప్రముఖ న్యాయవాది ఎంఎల్‌.శర్మ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతలుగా ఎన్నికలు జరపడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21కి వ్యతిరేకమని ఆయన వాదిస్తున్నారు.