తిరుపతి పార్లమెంట్ ఎన్నిక.. చర్చంతా ఆ నియోజకవర్గం మీదే..!

ప్రస్తుతం ఏపీలో పొలిటికల్​ హీట్​ నెలకొన్నది. ప్రస్తుతం అందరి దృష్టి తిరుపతి ఎంపీ సీటు పైనే ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్​ ఎన్నికల్లో వైసీసీ ఘన విజయం సాధించింది కాబట్టి.. ఇక్కడ ఆ పార్టీ గెలుపు పక్కా అని భావిస్తున్నారు. అయితే ఇక్కడ కనీసం గట్టి పోటీఅయినా ఇస్తే పరువు దక్కుతుందని టీడీపీ భావిస్తున్నది. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి డాక్టర్​ గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్​ అధికారి రత్నప్రభ రంగంలో ఉన్నారు. అయితే తిరుపతి పార్లమెంట్​ సెగ్మెంట్​ మొత్తం ఒక ఎత్తైతే.. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి మరో ఎత్తు అన్నట్టు ఉంది పరిస్థితి.

ఎందుకంటే ఈ నియోజకర్గ పరిధిలో వైసీసీకి ఎక్కువ ఓట్లు రావడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో ఇదే రిపీట్​ అయ్యింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో భయం పట్టుకున్నది. ఒకవేళ ఈ సారి కూడా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్​లో తక్కువ ఓట్లు వస్తాయేమోనని ఆ పార్టీ కార్యకర్తల్లో అనుమానం నెలకొన్నది.
2014లో తిరుపతి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి గెలుపొందారు.

అప్పట్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి ఎంపీగా పోటీ చేస్తే.. వైసీపీ నుంచి వరప్రసాద్‌ గెలిచారు. కానీ ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి 30 వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా తిరుపతి అసెంబ్లీ పరిధిలోకి వచ్చేసరికి సేమ్‌ సీన్‌ రిపీటైంది. టీడీపీ ఎంపీ అభ్యర్థికి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్​లో 3,578 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భూమన కరుణాకర్​రెడ్డి 800 ఓట్ల ఆధిక్యంతో గట్టెక్కారు.

అయితే ఇటీవల జరిగిన మున్సిపల్​ ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్​ను వైసీపీ సునాయాసంగా గెలిచింది. ఇక్కడ వైసీసీకే గట్టి పట్టు ఉందని ఆయన అంటున్నారు. గతంలోని పరిస్థితులు ఇప్పుడు రిపీట్​ కాకపోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల సీఎం జగన్​.. తిరుపతి పార్లమెంట్​ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారట. ఈ సందర్భంగా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్​పై ఆయన చర్చించినట్టు సమాచారం. ఈ సారి ఎలాగైనా తిరుపతి సెగ్మెంట్​లో కూడా భారీ మెజార్టీ తీసుకురావాని సీఎం ఆదేశించారట. ప్రస్తుతం గెలుపు ధీమాతో ఉన్న వైసీపీ భారీ మెజార్టీ సాధించాలని వ్యూహాలు రచిస్తున్నది.

మరోవైపు టీడీపీ, బీజేపీ ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారట. తిరుపతి పరిధిలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి కొత్త వ్యక్తి కావడం.. పనబాక లక్ష్మికి ప్రస్తుతం అంత ఉత్సాహంగా లేకపోవడం వైసీపీకి కలిసి రానున్నాయి.