కుంభమేళా ట్విస్ట్.. ఉత్తరాఖండ్ లోకి నో ఎంట్రీ

ఇటీవల సీఎం తిరత్ సింగ్ రావత్ వ్యాఖ్యలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. తాజాగా.. మరోసారి ఆయన తీసుకున్న నిర్ణయంతో వార్తల్లోకెక్కింది. మొత్తం 12 రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతంలోకి రాకుండా ఉత్తరాఖండ్ నిషేధం విధించింది. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపిస్తేనే ఎంట్రీ అని తేల్చి చెప్పింది. ఈమేరకు సీఎం రావత్ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా కేసులు పెరిగే వేళ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా ఇలాంటి ఆదేశాలివ్వడం సహజమే. అయితే కుంభమేళాకు సరిగ్గా రెండు రోజుల ముందు షాకింగ్ న్యూస్ చెప్పారు సీఎం రావత్. హరిద్వార్ లో కుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చే భక్తులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ చూపించాలనే నిబంధన తెరపైకి తెచ్చారు. కేవలం 24గంటల ముందుగా ఆ పరీక్ష చేసి ఉండాలనే ట్విస్ట్ కూడా అందులో ఉంది. అటు హరిద్వార్ కి వచ్చేవారందరికీ స్థానికంగా వ్యాక్సినేషన్ వేసేందుకు, కరోనా వ్యాధి నిర్ధార‌ణ‌ పరీక్షలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేపట్టడం విశేషం. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, పంజాబ్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్.. రాష్ట్రాలనుంచి వచ్చేవారంతా కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ చూపిస్తేనే ఉత్తరాఖండ్ లోకి ఎంట్రీ ఉంటుంది. కేరళ, తమిళనాడు లిస్ట్ లో ఉన్నా కూడా.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఇందులో మినహాయింపు ఇవ్వడం విశేషం.

ఉత్తరాఖండ్ లోని మూడు జిల్లాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల రిషికేష్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మొత్తం 76మందికి కరోనా సోకగా.. ఆ హోటల్ ని మూసివేశారు అధికారులు. మొత్తం ఆరు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి రోజువారీ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. ఉత్తరాఖండ్ లో కరోనా కేసులు లక్షకు చేరువ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో 1711మంది కరోనా కారణంగా మరణించారు. తాజాగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జనవరి 1 తర్వాత గత 24గంటల్లో అత్యథికంగా 366 కేసులు నమోదయ్యాయి.

కుంభమేళా సందర్భంగా కోవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందనే అనుమానాలతో సరిగ్గా రెండు రోజుల ముందు సీఎం రావత్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కుంభమేళాకు వచ్చేవారెవరైనా ఆ 12 రాష్ట్రాలకు చెందినవారయితే మాత్రం కచ్చితంగా కోవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ చూపించాల్సిందే. అది కూడా 24గంటల ముందుగా చేసిన పరీక్ష అయితేనే చెల్లుబాటవుతుంది. లేకపోతే తమ రాష్ట్రంలోకి నో ఎంట్రీ అని తేల్చి చెబుతున్నారు ఉత్తరాఖండ్ సీఎం.