మమత బ్యాండేజ్.. టాక్ ఆఫ్ బెంగాల్..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలకంటే మమతా బెనర్జీ కాలిగాయం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. మార్చి 10న నందిగ్రామ్ లో నామినేషన్ వేసి తిరిగొస్తున్న సందర్భంగా మమతా బెనర్జీ కాలికి గాయం అయింది, కారు డోరుని కొంతమంది తోసేసుకుని వెళ్లడంతో ఆమె కాలు, కారు డోరు మధ్యలో ఇరుక్కుని ఎముక విరిగింది. దీంతో కాలికి బ్యాండేజ్ తో, చక్రాల కుర్చీనుంచే మమత ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. అప్పటినుంచీ ఇప్పటి వరకూ మమత కాలి గాయం టాక్ ఆఫ్ బెంగాల్ గా మారింది.

తాజాగా మమత గాయపడిన కాలుని కదిపిందంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రణయ్ రాయ్ ఓ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. కాలిగాయం అంతా ఓ డ్రామా అని, ఓట్లకోసం ఆడుతున్న నాటకం అని విమర్శించారు. చక్రాల కుర్చీ అనే ఘట్టాన్ని రసవత్తరంగా పోషించిన మమత, ఇక దానికి తెరదించాలని అన్నారు. అయితే ఆ వీడియోలో మమత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ లు చేస్తున్నారని, అందుకే కాలు కదిపారని అంటున్నారు తృణమూల్ నేతలు. వ్యాయామం చేయాలనుకుంటే, నడవడంకంటే ఉత్తమం ఇంకేముంటుందని ఆ వివరణపై సైతం విమర్శలు మొదలు పెట్టారు బీజేపీ నేతలు. కాలికి గాయం తగిలినప్పటినుంచి బ్యాండేజీ పరిమాణం రోజు రోజుకీ పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు. మమతలో ఓటమి భయం లాగే బ్యాండేజీ పరిమాణం రోజు రోజుకీ పెరిగిపోతోందని అన్నారు బీజేపీ నేత రాహుల్ సిన్హా.

బెర్ముడాలు, షార్ట్ ల నుంచి నాటకాల వరకు..
మమత కాలి గాయంతో ప్రచారానికి వచ్చిన తొలినాళ్లలో బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఆమెపై చేసిన వ్యాఖ్యల్ని బెంగాల్ ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించారు. చీర కట్టులో మమత గాయం సరిగా ప్రజలకు కనిపించడంలేదని, ఆమె బెర్ముడాలు, లేదా షార్ట్ లు ధరిస్తే.. గాయం బాగా కనిపించి సింపతీ పెరిగే అవకాశం ఉందని సలహా ఇచ్చారు దిలీప్ ఘోష్. ఆ తర్వాత మహిళా లోకం నుంచి విమర్శలు ఎదురవడంతో వెనక్కి తగ్గారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రూపంలో మమత కాలి గాయాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు బీజేపీ నేతలు. తాజాగా ఆ గాయం ఓ నాటకం అని విమర్శలు మొదలు పెట్టారు.

మరీ అంత చీప్ గా విమర్శలు చేస్తారా..?
బీజేపీ విమర్శలపై టీఎంసీ మండిపడుతోంది. మమతతోపాటు ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్లను, యావత్ బెంగాల్ ప్రజలను సైతం బీజేపీ నేతలు అవమానిస్తున్నారని అంటున్నారు తృణమూల్ నేతలు. మమత విషయంలో డాక్టర్లు ఎలా అబద్ధాలు చెబుతారంటూ ప్రశ్నించారు బీజేపీ మాజీ, తృణమూల్ తాజా నేత యశ్వంత్ సిన్హా. మొత్తమ్మీద మమతా బెనర్జీ కాలిగాయం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.