వకీల్ సాబ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా : పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్లు నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కాబోతోంది.

కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు నిర్మాత దిల్ రాజు, ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న అంజలి, అనన్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థానానికి చేరుకుని ఎన్నో విజయాలు సాధించిన దిల్ రాజు గారితో వకీల్ సాబ్ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దిల్ రాజు గారి తో ఇంతకుముందే సినిమా చేసి ఉంటే బాగుండేదనిపించింది.

స్వశక్తితో ఎదిగిన వేణు శ్రీరామ్ వంటి దర్శకుడితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాలో ప్రతివాద లాయర్ గా ప్రకాష్ రాజ్ నటించడం ఈ సినిమాకు మరింత బలం చేకూర్చింది. ఎదురుగా ఒక బలమైన నటుడు ఉన్నారంటే ఫర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా వస్తుంది.

ప్రకాష్ రాజు గారిని ఈ సినిమా లో భాగం చేసిన దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాజకీయంగా నాది, ప్రకాష్ రాజ్ ది విభిన్న పంథా అయినప్పటికీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మేమంతా ఒక్కటే. ఆయన నాపై రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసి ఉండొచ్చు. అయినా నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తా. సినిమా పరంగా ప్రకాష్ రాజ్ నాకు ఇష్టమైన నటుడు.

అక్క చెల్లెళ్లు, ఆడపడుచులు, అమ్మ, పెద్దమ్మలు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. వారందరికీ ఈ వకీల్ సాబ్ రూపంలో ఓ సినిమా చేసి వారి తరపున నిలబడినందుకు సంతోషంగా ఉంది.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ ‘ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమను డిస్ట్రిబ్యూట్ చేశాను. అప్పటి నుంచి పవన్ తో సినిమా చేయాలని బలంగా ఉండేది. పింక్ రీమేక్ ద్వారా అది ఇన్నేళ్లకు కుదిరింది. వకీల్ సాబ్ తో నా 22 ఏళ్ల కల నెరవేరింది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, క్రిష్,సాగర్, నిర్మాత ఏఎం రత్నం పాల్గొన్నారు.