ప్రచారంలో దేవుళ్ల ఫొటోలు.. కమల్​పై కేసు.. !

ప్రముఖ సినీ హీరో, మక్కల్​ నీది మయ్యం పార్టీ అధినేత కమల్​ హాసన్​ పై కేసు నమోదైంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 7 గంటల వరకే ప్రచారానికి గడువు ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. కమల్​ హాసన్​ సైతం తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన కూతురు అక్షర, నటి సుహాసిని సైతం ప్రచారంలో పాల్గొన్నారు. అటు డీఎంకే, అన్నాడీఎంకే అగ్రనేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

ఇదిలా ఉంటే ప్రచారంలో భాగంగా కమల్​ హాసన్​ హిందూ దేవుళ్లయిన శ్రీరాముడు, అమ్మవారి వేషధారణలో కొంతమందిని తన ప్రచారరథం పైకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వీళ్లంతా మనదేవుళ్లు. కానీ కొన్ని పార్టీలు మాత్రం ఈ దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నాయి’ అంటూ ప్రసంగించారు. ఈ ప్రసంగం తీవ్ర వివాదాస్పదం అయ్యింది.

కమల్​ హాసన్​ ఓ వర్గాన్ని కించపరిచారని.. చట్ట విరుద్ధంగా ప్రచారంలో దేవుళ్ల ను వాడుకున్నారని.. సమాజంలో అశాంతిని సృష్టించడానికి యత్నించారని కొందరు ఆరోపణలు చేశారు. అంతేకాక కమల్​పై కేసు కూడా పెట్టారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో కమల్‌ సహా ముగ్గురిపై కాట్టూరు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది.

కాగా, కమల్ ప్రసంగంలో తప్పేం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరేమో ఆయన ఓ వర్గాన్ని కించపరుస్తున్నారంటూ వ్యాఖ్యనిస్తున్నారు. ఈ ఘటన ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.