తులం బంగారం 50 వేలు అయ్యే ఛాన్స్.. కారణాలు ఇవే..

బంగారం ధరలు ఒక్క సారిగా జూమ్ అంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్లో తులం బంగారం ధర స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,917 నుంచి రూ.45,176కు పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,144 నుంచి 41,381కు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,260గా ఉంది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ. 46,100 ఉంది. ఇక బంగారం ధరలు పెరిగేందుకు ముఖ్య కారణం, కరోనా కేసులనే చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి లాక్ డౌన్ పెడతారనే భయంతో ముంబైలో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. దీంతో పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి సురక్షిత పెట్టుబడి సాధనం అయిన బంగారం వైపు తరలిస్తున్నారు. దీని వల్ల కూడా బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు విషయాలపై బంగారం ధర ఆధారపడి ఉంది.

అటు అంతర్జాతీయంగా చూస్తే 2021 ఏప్రిల్‌ 1వ తేదీ గురువారంతో ముగిసిన వారంలో ఔన్సు (31 గ్రాములు) బంగారం ధర 1,730 డాలర్లకు చేరింది. 1,750 డాలర్ల స్థాయిని అధిగమిస్తే, తిరిగి పసిడి 1,850 డాలర్ల స్థాయికి ఎగసే అవకాశాలు ఉన్నాయి. ఇదే కొనసాగితే మరోసారి తులం బంగారం 50 వేలు దాటే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, వ్యాక్సినేషన్‌ విస్తృతి, సెకండ్‌ వేవ్‌ వంటి అంశాలపై పసిడి భవిష్యత్‌ ధర ఆధారపడి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.