ఆలోచింపజేసే గూగుల్.. వ్యాక్సిన్ వీడియో..

ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైంది. మహమ్మారి మరోసారి వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా యూజర్స్‌ని వ్యాక్సినేషన్‌కు ప్రోత్సహించేలా గూగుల్ ఓ వీడియోను రూపొందించింది.

జనాల్లో ప్రస్తుతం వ్యాక్సిన్ అంటే కొంత భయం నెలకొంది. చాలామంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇండియాలోనే కాకుండా చాలా దేశాల్లో వ్యాక్సిన్‌పై ప్రజలు అనుమాన పడుతున్నారు. అందుకే జనాల్లో వ్యాక్సినేషన్‌ భయాలు తొలగించే ప్రయత్నంగా గూగుల్ ఓ వీడియో రూపొందించింది.

‘గెట్ బ్యాక్ టు వాట్ యు లవ్’ అనే పేరుతో రూపొందించిన వీడియో చాలా ఎమోషనల్‌గా కోవిడ్ కష్టకాలాన్ని గుర్తు చేస్తుంది. కోవిడ్ టైంలో గూగుల్ లో ఎలాంటి పదాలు ఉపయోగించామో చూపించడంతో పాటు వ్యాక్సిన్ ఫలితంగా ఆ పదాలు ఎలా మారుతున్నాయో వివరించింది.

కోవిడ్ సమయంలో గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు. లాక్ డౌన్, క్వారంటైన్ అనే పదాలను గుర్తు చేస్తూ.. స్కూల్స్, చర్చిలు అన్ని క్లోజ్ అవ్వడం, ఆన్‌లైన్ పూజల ద్వారా గుళ్లో హారతి తీసుకోవడం, వర్చువల్ పార్టీలు, వీడియో కాల్స్ ఇలా కరోనా వల్ల మనం కోల్పోయిన సంతోషాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించింది.

ఆ తర్వాత మెల్లగా అన్నీ ఓపెన్ అయ్యినట్టు, మెల్లగా పరిస్థితులన్నీ మారిపోతున్నట్టు ఈ వీడియోలో ఎంతో క్రియేటివ్‌గా చూపించారు. ‘గెట్ బ్యాక్ టు వాట్ యు లవ్’అని చెప్తూ.. చివరగా ‘కోవిడ్ వ్యాక్సిన్ నియర్ మి’ అనే గూగుల్ సెర్చ్‌తో వీడియో ముగుస్తుంది. అంటే కోవిడ్‌తో చెల్లాచెదురైన జీవితాన్ని తిరిగి నచ్చిన విధంగా మార్చుకోవాలంటే.. భయాలు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ వీడియో చెప్తోంది. అందర్నీ ఆలోచింపజేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.