ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఫుల్ బెంచ్ కొట్టి వేసింది. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో రేపు యథావిధిగా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. కరోనా కారణంగా ఆగిపోయిన స్థానిక ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదలు పెట్టిన అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేశారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియను ను కొనసాగించకుండా ఆయన పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత పదవిలోకి వచ్చిన నీలం సాహ్ని, బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఆగిపోయిన పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనసేన, బీజేపీ సహా.. టీడీపీ కూడా మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరాయి. దీంతో సింగిల్ బెంచ్ జడ్జి ఎన్నికలను నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు, పోలింగ్ కు కనీసం నాలుగు వారాలు గ్యాప్ ఉండాలని, నాలుగు వారాలు ఎన్నికల కోడ్ అమలులో లేకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదంటూ సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకించారు.

దీంతో ఈ తీర్పుని కొట్టివేయాలంటూ, ఎన్నికలు యథావిధిగా కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫుల్ బెంచ్ ని ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పునిస్తూ, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది.

ఫలితాల విషయంలో కండిషన్..
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 8న పోలింగ్, 10న కౌంటింగ్, అదేరోజు ఫలితాల ప్రకటన ఉండాలి. అయితే ఫలితాల ప్రకటనపై మాత్రం డివిజనల్ బెంచ్ ఆంక్షలు విథించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 15న తిరిగి వాదనలు వింటానని చెప్పింది.

తీవ్ర ఉత్కంఠ..
హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి ఉత్కంఠ కొనసాగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికలు ఆగిపోయాయని అందరూ అనుకుంటున్న వేళ, ఎన్నికల కమిషన్ ఫుల్ బెంచ్ మందుకు వెళ్లింది. రాత్రి వాదనలు జరిగాయి, తీర్పు తెల్లవారికి వాయిదా పడింది. ఈరోజు ఉదయాన్నుంచి కూడా హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నడిచింది. ఓవైపు ఉద్యోగులు ఎన్నికల విధులకు వెళ్లాలా, వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఎంపీడీవో ఆఫీస్ ల ముందు ఎన్నికల సామగ్రికోసం ఉద్యోగులు పడిగాపులు కాశారు. చివరకు హైకోర్టు తీర్పుతో ఉద్యోగులంతా సామగ్రి తీసుకుని విధులకు బయలుదేరారు.