బందీని విడుదల చేస్తాం.. మేం చర్చలకు సిద్ధం – మావోయిస్ట్ లు..

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌ ఎన్ కౌంటర్ అనంతరం మావోయిస్ట్ లు తమ వద్ద బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ ని విడుదల చేసేందుకు కొన్ని కండిషన్లు పెట్టారు. ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీగా ఉన్న కోబ్రా కమాండోను విడుదల చేస్తామన్నారు. ఈమేరకు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. కాల్పుల్లో 23మంది జవాన్లు మృతిచెందారని, నలుగురు మావోయిస్ట్ లు చనిపోయారని ప్రకటించారు. తాము స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మరణించిన మావోయిస్ట్ ల ఫొటోలు విడుదల చేశారు.

‘ప్రహార్.. సమాధాన్’ కి ఇదే మా సమాధానం..
చర్చల పేరుతో ప్రకటన విడుదల చేసిన మావోయిస్ట్ లు మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మావోయిస్ట్ లను అణచివేయడానికి, సామ్రాజ్యవాద కంపెనీలకు వనరుల దోపిడీకి మార్గం సుగమం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వనరుల దోపిడీకి మావోయిస్టు పార్టీ ఆటంకంగా మారడంతో సైనిక దాడులు చేయిస్తున్నారని, ప్రజలను, వనరులను కాపాడటం కోసమే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ప్రతిదాడి చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. 2020-ఆగస్టులో మావోయిస్ట్ ల అణచివేతకోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ ప్రహార్‌- ఆపరేషన్‌ సమాధాన్‌’ అనే ప్రణాళిక రూపొందించిందని ఆరోపించారు. ఈ ప్రణాళిక అమల్లో భాగంగా 150మందికి పైగా గ్రామీణ ప్రజల్ని భద్రతా బలగాలు చంపాయని, మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు సామాన్య ప్రజల్ని కూడా పొట్టనపెట్టుకున్నారని, వేలాదిమందిని జైళ్లలో పెట్టారని, మహిళలను సైతం హింసించి హత్యచేశారని ఆరోపించారు. ఓవైపు ఊచకోత కోస్తూనే మరోవైపు అభివృద్ధి పేరుతో రోడ్లు వేసుకుని, పోలీస్ శిబిరాలు నిర్మిస్తూ దండకారణ్యంలోకి చొచ్చుకుని వస్తున్నారని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని, రాజకీయ సంక్షోభం మరింత తీవ్రం అవుతోందన్నారు. ఫాసిస్టు ‘సమాధాన్‌- ప్రహార్‌’కు పీఎల్‌జీఏ ప్రతీకారం తీర్చుకుంటుందని, వీటన్నింటికీ మోదీ, అమిత్‌షా బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.

పోలీసు కుటుంబాలకు సానుభూతి..
“పోలీసులు మాకు శత్రువులు కారు. పాలకవర్గాలు తెచ్చిపెట్టిన అన్యాయమైన యుద్ధంలో బలిపశువులు కావద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం.” అని మావోయిస్ట్ లు తమ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల మరణాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. కాల్పుల ఘటనకు కొద్ది రోజుల ముందు మావోయిస్ట్ సానుభూతి పరుడిని పోలీసులు హత్య చేసి, ఎన్ కౌంటర్లో చనిపోయాడని అబద్ధాలు చెప్పారని లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 3న ఐజీ సుందర్ ‌రాజ్‌ నాయకత్వంలో 2,000 మంది పోలీసులు దాడి కోసం వచ్చారని తెలిపారు. వీటన్నిటికి ప్రతీకారంగానే కాల్పులు జరిపామని చెప్పారు.

మావోయిస్ట్ లు విడుదల చేసినట్టు చెబుతున్న ఫ్లై కెమెరా దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు మావోయిస్ట్ ల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. మావోల ప్రతిపాదనపై ఇంకా ప్రభుత్వం స్పందించలేదు.