మహారాష్ట్ర మంత్రిమండలికి ముడుపుల మకిలి..

ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారి ఠాక్రే సర్కారుకి ముప్పులా పరిణమిస్తోంది. ఈ కేసులో సచిన్ వాజే అనే పోలీస్ అధికారి అరెస్ట్ కావడం, అతనితో హోం మంత్రికి ఉన్న లాలూచీపై మరో అధికారి పరమ్ బీర్ చేసిన సంచలన ఆరోపణలతో హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పదవి పోగొట్టుకోవడం తెలిసిందే. అయితే ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వాజే, అధికారులకు రాసిన 4పేజీల లేఖ ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఆ లేఖలో ఆయన ఏకంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరుని, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరుని, శివసేనకు చెందిన మంత్రి అనిల్ పరబ్ పేరుని కూడా ప్రస్తావించారు. గతంలో సస్పెన్షన్లో ఉన్న తనను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒప్పుకోలేదని, 2 కోట్లు ఇస్తే ఆయన్ను ఒప్పిస్తానని అనిల్ దేశ్ ముఖ్ తనతో చెప్పారని ఆరోపించారు. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ 100కోట్ల వసూళ్ల టార్గెట్ వాస్తవమేనని ఒప్పుకున్నారు.

సైఫీ బుర్హానీ అప్‌ లిఫ్ట్ ‌మెంట్‌ ట్రస్ట్ దగ్గర 50కోట్ల రూపాయలు వసూలు చేయమన్నారని, ముంబైలోని బార్లపై దాడులు చేసి, యాజమాన్యాలను బెదిరించి ఒక్కో బార్ నుంచి 3 కోట్ల వరకు వసూలు చేయమని చెప్పారని అన్నారు. శివసేనకు చెందిన మరో మంత్రి అనిల్ పరబ్.. ముంబైలోని కాంట్రాక్టర్లను బెదిరించి ఒక్కొక్కరి వద్ద 2కోట్లు వసూలు చేసి, 50 మంది కాంట్రాక్టర్ల వద్ద 100కోట్లు తీసుకోవాలని చెప్పినట్టు ఆ లేఖలో వివరించారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరు కూడా లేఖలో ప్రస్తావించారు సచిన్ వాజే. అజిత్ పవార్ సన్నిహితుడు దర్శన్ అనే వ్యక్తి, గుట్కా మాఫియా నుంచి 100కోట్లు వసూలు చేయాల్సిందిగా తనకు టార్గెట్ పెట్టినట్టు చెప్పారు. వసూలు చేయకపోతే ఉద్యోగంలోనుంచి తీసేస్తామని హెచ్చరించారని అన్నారు. అయితే తనకు టార్గెట్లు పెట్టిన విషయాల్ని మాత్రం ప్రస్తావించిన సచిన్ వాజే.. తానెక్కడా తప్పు చేయలేదని, వారి టార్గెట్లు ఒప్పుకోలేదని వివరించారు. సస్పెన్షన్ లో ఉన్న తనకు ముంబై పరిధిలో కీలక పోస్టింగ్ ఎలా వచ్చిందో మాత్రం చెప్పలేకపోయారు.

వాజే లేఖతో మరోసారి మహారాష్ట్రలో కలకలం రేగింది. శివసేన మంత్రితోపాటు.. ఏకంగా శరద్ పవార్, అజిత్ పవార్ పై కూడా ఆరోపణలు చేయడంతో.. మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు వాజే . ఎన్‌ఐఏ కస్టడీని ఏప్రిల్‌ 9 వరకు పొడిగించారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారిస్తున్న సీబీఐ.. వాజేను కూడా ప్రశ్నిస్తోంది. అటు వాజే ఆరోపణలను మరో మంత్రి అనిల్‌ పరబ్‌ ఖండించారు.